దశాబ్దాలుగా మన దేశ రోడ్లపై పెట్రోల్ బైక్‌లదే హవా నడుస్తోంది. ఎందుకంటే నమ్మకమైనవి ఇంకా రిపేర్లు చేయించడం ఈజీ, పైగా ఎక్కడ పడితే అక్కడ బంకులు, మెకానిక్ షాపులు ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. పెట్రోల్ ధరలు మండిపోతుండటం, కొత్తగా ఈవీ టెక్నాలజీ వేగంగా అందుబాటులోకి వస్తుండటంతో... ప్రతిరోజు ప్రయాణాల కోసం చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను ఒక మంచి ఆప్షన్‌గా చూస్తున్నారు.
అయితే, పెట్రోల్ బైక్ కంటే ఎలక్ట్రిక్ బైక్ బెటర్ అని చెప్పడం అంత ఈజీ కాదు. మన దేశంలో ఒకరు ఏ బైక్ కొనాలనేది, వారు నిత్య జీవితంలో ఎలా వాడుతారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.
సిటీలో తిరిగే వారికి
సిటీ నగరాల్లో ప్రయాణించే వారికి ఎలక్ట్రిక్ బైక్‌లు ఇప్పుడు చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి. సిటీల్లో ఉండేవాళ్లు రోజుకు దాదాపు 20 నుండి 50 కిలోమీటర్లు తిరుగుతుంటారు. ప్రస్తుత ఎలక్ట్రిక్ బైక్‌లు ఇచ్చే మైలేజ్ ఈ దూరానికి చాలా ఈజీగా సరిపోతుంది. ట్రాఫిక్‌లో ప్రతిసారి క్లచ్ నొక్కడం, గేర్లు మార్చడం వంటి తలనొప్పులు ఈవీల్లో ఉండవు, ఈజీగా డ్రైవింగ్ చేయోచ్చు.
ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి సిటీల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు.. ఆగి ఆగి వెళ్లడానికి ఈవీల పికప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెట్రోల్ కొట్టించడంతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్‌ను ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఈవీల్లో ఇంజిన్ ఆయిల్ మార్చడం, క్లచ్ ప్లేట్లు అరిగిపోవడం లాంటి సమస్యలు ఉండవు. మూవింగ్ పార్ట్స్ తక్కువగా ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఆఫీసులకు వెళ్లేవారికి, ప్రతిరోజు ప్రయాణించేవారికి ఎలక్ట్రిక్ వాహనాల వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి.
పెట్రోల్ బైక్‌స్ లాభాలు
ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న.. ఇండియాలో పెట్రోల్ బైక్‌లకు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. దానికి కారణం కంఫర్ట్. మన దేశంలో ఏ మూలకు వెళ్లినా పెట్రోల్ బంకులు ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పాయింట్లు ఇంకా అన్ని చోట్లా రాలేదు. లాంగ్ జర్నీలు చేసే వారికి, చిన్న చిన్న టౌన్లలో ఉండేవారికి పెట్రోల్ బైకులే కరెక్ట్. పెట్రోల్ కొట్టించడానికి కేవలం రెండు నిమిషాలు పడుతుంది. అదే ఈవీ అయితే దారి మధ్యలో ఛార్జింగ్ అయిపోతుందేమో అనే టెన్షన్ ఉంటుంది.
►ALSO READ | లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్‌బీఐ బ్రేక్: మారిన రూల్స్ ఇవే..
మన దేశంలో బైక్ కొంటే చాలా ఏళ్లు వాడుకుంటారు. పెట్రోల్ బైక్‌ల లైఫ్, వాటి రీసేల్ వాల్యూ, ఎక్కడైనా దొరికే సర్వీస్ సపోర్ట్ మీద జనాల్లో గట్టి నమ్మకం ఉంది. ఈవీలు ఎంత బాగున్నా... బ్యాటరీ మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఇవి ఎన్ని రోజులు పనిచేస్తాయి ? అమ్మితే ఎంత రేట్ వస్తుంది? అనే భయాలు ఇంకా జనాల్లో పోలేదు.
బైక్‌తో ఉండే ఎమోషనల్ బాండింగ్
భారతదేశంలో బైక్ అనేది కేవలం ప్రయాణాలకి వాడే ఒక వాహనం మాత్రమే కాదు. చాలా మందికి బైక్‌తో ఒక రకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఇంజిన్ నుంచి వచ్చే సౌండ్, గేర్లు మార్చే ఫీలింగ్, ఆ వైబ్రేషన్స్... ఇవన్నీ నడుపుతుంటే ఇచ్చే కిక్‌లో భాగం. చాలా మంది బైక్ లవర్స్‌కి పెట్రోల్ బైక్ ఇచ్చే ఆ ఫీలింగ్‌ను ఎలక్ట్రిక్ బైక్‌లు అస్సలు ఇవ్వలేకపోతున్నాయి.
చివరిగా చెప్పాలంటే... ప్రస్తుతం ఈ రెండు రకాల బైక్‌లకు వాటి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉండి, కేవలం సిటీ లోపల రోజు ఉండే పనులకే వాడాలనుకుంటే... ఎలక్ట్రిక్ బైక్ డబ్బు సేవింగ్స్ , ప్రాక్టికల్ ఛాయిస్ అవుతుంది.
అదే మీరు రోజు లాంగ్ జర్నీలు చేస్తుంటే, లేదా పల్లెటూళ్లలో ఉంటుంటే, ఎలాంటి టెన్షన్ లేని ప్రయాణం కావాలనుకుంటే మాత్రం... ఇప్పటికీ పెట్రోల్ బైకే బెస్ట్ ఆప్షన్.
