ఇంట్లో పేలిన ఎలక్ట్రికల్ స్కూటర్

ఇంట్లో పేలిన ఎలక్ట్రికల్ స్కూటర్

ఇప్పుడంతా ఎలక్ట్రికల్ మయం.. బండ్లు కూడా వచ్చేశాయ్.. చార్జింగ్ పెట్టుకని ఎంత చక్కగా వెళ్లిపోవచ్చు. పెట్రోల్ బంకులతో అస్సలు పనేలేదు.. ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నాయి.. అందరూ ఈవీ వైపు మళ్లుతున్న సమయంలోనే.. కొన్ని ఆశ్చర్యకరమైన ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూల్ పేలిపోవటం సంచలనంగా మారింది.

కర్నాటక రాష్ట్రం మాండ్యా జిల్లా మద్దూర్ తాలూకాలోని వలగెరెహళ్లి గ్రామంలోని ముత్తురాజ్ అనే వ్యక్తి.. ఆరు నెలల క్రితం 85 వేల రూపాయలతో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేశారు. నిన్నటి వరకు బాగానే పని చేస్తూ వచ్చింది బండి. మార్చి 13వ తేదీ సోమవారం ఉదయం ఇంటి ఆవరణలోనే చార్జింగ్ పెట్టాడు. అలా చార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లిన ఐదు నిమిషాల్లో బండి పేలిపోయింది. మొదట పెద్ద శబ్ధంతో బ్యాటరీ పేలిందని.. ఆ తర్వాత మంటలు వ్యాపించాయని.. స్కూటర్ మొత్తం కాలిపోయిందని చెబుతున్నాడు ముత్తురాజ్. 

పెద్ద శబ్దానికి ఇంట్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయని.. టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ దెబ్బతిన్నాయని.. ఇంటి అద్దాలు పగిలిపోయాయని చెబుతున్నారు. స్కూటర్ సమీపంలో ఎవరూ లేరని.. కుటుంబ సభ్యులు ఐదురుగు ఇంట్లో ఉండటం వల్ల.. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతున్నాడు ముత్తురాజ్. ఈ విషయంపై షోరూం యాజమాన్యానికి సమాచారం ఇచ్చామని.. పోలీసులకు కూడా కంప్లయింట్ చేసినట్లు చెబుతున్నాడు బాధితుడు. మళ్లీ బయటకు వెళ్లాలనే ఉద్దేశంతో స్కూటర్ లోనే మొబైల్ పోన్, పర్సు, ఇతర వస్తువులు కాలిపోయినట్లు చెబుతున్నారు. ఆరు నెలలుగా ఎలాంటి సమస్య లేదని.. ఇప్పుడే ఒకేసారి బ్యాటరీ పేలి.. స్కూటర్ కాలిపోయింది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. పెద్ద ప్రమాదం నుంచి బయపడినట్లు వెల్లడించారు. 

ఈ ఘటనపై ఎలక్ట్రికల్ స్కూటర్ కంపెనీ, షోరూం ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ చేస్తున్నామని.. ఘటనకు కారణాలు కనుక్కుంటామని వివరించింది షోరూం యాజమాన్యం.