జీవన్ రెడ్డి మాల్​కు మళ్లీ కరెంట్

జీవన్ రెడ్డి మాల్​కు మళ్లీ కరెంట్

ఆర్మూర్, వెలుగు : బకాయిలు చెల్లించని కారణంగా ఈనెల 7న ఆర్మూర్  మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్​కు కరెంట్​ సప్లయ్​ నిలిపేసిన ట్రాన్స్ కో అధికారులు హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం కరెంట్​ సరఫరాను పునరుద్ధరించారు. కరెంట్​ సరఫరా పునరుద్ధరణ విషయమై జీవన్ రెడ్డి మాల్ యాజమాన్యం హైకోర్ట్ లో లంచ్  మోషన్  పిటిషన్  వేసింది. విద్యుత్  బకాయిలు రూ.2.57 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.1.80 కోట్లు చెల్లించామని మాల్  యాజమాన్యం తెలిపింది. మిగతా రూ.80 లక్షల బకాయిలను మొదటి విడత రూ.40 లక్షలు ఈనెల 21లోగా కడతామని,  రూ.40 లక్షలు మూడు వారాల్లో కడతామని అఫిడవిట్​ సమర్పించింది.

విద్యుత్  అధికారులపై పరువునష్టం దావా

నిబంధనలన్నీ సక్రమంగానే ఉన్నా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి కరెంట్​ సరఫరా నిలిపేసి, తమ ప్రతిష్టకు భంగం కలిగించారని విద్యుత్  శాఖ అధికారులపై జీవన్ రెడ్డి మాల్  యాజమాన్యం కోర్టులో పరువునష్టం దావా వేసింది. జిల్లా విద్యుత్  శాఖ అధికారితో పాటు అన్ని స్థాయుల అధికారులపై పరువునష్టం దావా వేశామని మాల్ యాజమాన్యం పేర్కొంది. అన్యాయంగా కరెంట్​సరఫరా నిలిపివేయడం వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించలేకపోతున్నామని, పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరంలో కూడా పిటిషన్  దాఖలు చేశామని యాజమాన్యం వెల్లడించింది.