పెరుగుతున్న కరెంట్ డిమాండ్.. ప్రతిరోజు 14 వేల మెగావాట్లకు పైనే

పెరుగుతున్న కరెంట్ డిమాండ్.. ప్రతిరోజు 14 వేల మెగావాట్లకు పైనే
  • ఈ నెల 11న 15,266 మెగావాట్ల రికార్డు డిమాండ్ నమోదు 
  • విద్యుత్ కొనేందుకు నిధుల్లేక సంస్థల ఇబ్బందులు 
  • కోతలకు సిద్ధమవుతున్న డిస్కమ్​లు
  • ఇప్పటికే అప్రకటిత కోతలు షురూ 

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పెరిగింది. వానాకాలం సీజన్‌‌లో ఎండాకాలం లెక్క విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. వాతావరణ మార్పులతో వ్యవసాయానికి పెద్ద ఎత్తున కరెంటు అవసరమవుతుండడం, ఎండ తీవ్రత పెరిగి పట్టణ ప్రాంతాల్లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. నిరుటితో పోలిస్తే 15 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. భూగర్భజలాలు పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల బోర్లు నడుస్తున్నాయి. పంటలకు నీళ్ల కోసం బోర్లపైనే రైతులు ఎక్కువగా ఆధా రపడుతున్నారు. దీంతో కరెంటు డిమాండ్‌‌ రోజురోజుకు పెరుగుతోంది. 

నెల రోజులుగా కరెంటు డిమాండ్‌‌ రోజూ 14 వేల మెగావాట్లకు పైగానే ఉంటోంది. ఈ నెల 11న అత్యధికంగా 15,266 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. వానాకాలం సీజన్‌‌లో ఇంత డిమాండ్‌‌ ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ఈ నెల 10న 15,005 మెగావాట్ల డిమాండ్ ఉండగా.. 12న 15,139, 13న 15,149,  14న 14,859, 15న 14,261 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌‌ నమోదైంది. సోమవారం 14,489 మెగావాట్ల డిమాండ్ రికార్డయింది. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో సరఫరా చేయలేక సంస్థలు కష్టాలు పడాల్సి వస్తోంది. మరోవైపు కరెంట్ కొనేందుకు నిధులు లేక ఇబ్బందులు ఎదురవు తున్నా యి. డిమాండ్‌‌ ఇలాగే కొనసాగితే కరెంటు కష్టాలు తప్పవని విద్యుత్‌‌ సంస్థల పెద్దలు అంటున్నారు. 

కరెంటు సరఫరాకు కష్టాలు.. 

డిమాండ్‌‌కు తగ్గట్టు త్రీఫేజ్‌‌ కరెంటు సరఫరా చేయలేక డిస్కమ్​లు చేతులెత్తేసే పరిస్థితి నెల కొంది. వానాకాలంలో వరి సాగు పెరగడం, కృష్ణా నది నీళ్లు రాకపోవడం, రైతులు బోర్ల పైనే ఆధారపతుండడంతో కరెంట్ వాడకం ప్రతిరోజు 280 నుంచి 292 మిలియన్ యూనిట్లకు పైగానే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌‌కో నుంచి హైడల్‌‌, థర్మల్‌‌ పవర్ కలిపి 80 నుంచి 88 మిలియన్‌‌ యూనిట్లలోపే ఉత్పత్తి అవుతోంది. సింగరేణి నుంచి 26 మిలియన్ యూనిట్ల వరకు వస్తుండగా, మిగతా 200 మిలియన్ యూ నిట్ల వరకు కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేయాల్సి వస్తోంది. ఇందులో 142 మిలియన్‌‌ యూ నిట్లు సెంట్రల్‌‌ జనరేటింగ్‌‌ స్టేషన్‌‌ల నుంచి కొంటుండగా, మరో 35 నుంచి 41 మిలియన్‌‌ 
యూనిట్ల వరకు నేషనల్‌‌ కరెంట్

ఎక్స్ఛేంజ్​ల నుంచి కొంటోంది. అయినప్పటికీ డిమాండ్‌‌కు తగ్గ సరఫరా చేయలేక చేతులెత్తే పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయానికి త్రీఫేజ్‌‌ కరెంట్ ఇవ్వలేక నార్తర్న్‌‌ డిస్కమ్ పరిధిలో చాలా ప్రాంతాల్లో అప్రకటిత కోతలు మొదలయ్యాయి. మరోవైపు కరెంటు కొనుగోళ్ల కోసం సీఎం చెప్పినా నిధులు ఇవ్వడం లేదంటూ తాజాగా ట్రాన్స్‌‌కో సీఎండీ ఐఏఎస్‌‌ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.