పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు.. 2025-26 మొదటి క్వార్టర్లో 47 శాతం

పెరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు.. 2025-26 మొదటి క్వార్టర్లో 47 శాతం
  • కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జూన్​ క్వార్టర్లో (మొదటి క్వార్టర్​) భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 47 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి  పీయూష్  గోయల్ తెలిపారు. 2024-25లో ఇదే క్వార్టర్​తో పోలిస్తే ఈ పెరుగుదల కనిపించింది. ఈ క్వార్టర్లో ఎగుమతుల విలువ  12.4 బిలియన్ డాలర్లని ఆయన ఎక్స్​లో పోస్టు చేశారు. 

2014-15 నుంచి పదేళ్లలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి  31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం సాధించిన   గొప్ప విజయమని పేర్కొన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిచిందని,   ఫలితంగా 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 300కు పైగా పెరిగిందని ఆయన వివరించారు. భారత్ ఒకప్పుడు మొబైల్ దిగుమతిదారుగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదిగిందని వెల్లడించారు.

ఎలక్ట్రానిక్స్ రంగం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కూడా కల్పించిందని, సోలార్ మాడ్యూల్స్, నెట్‌‌వర్కింగ్ పరికరాలు, ఛార్జర్ అడాప్టర్ల ఎగుమతులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన వెల్లడించారు. పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతుల విలువ 2014–-15లో రూ. 38,000 కోట్ల నుంచి 2024-–25లో రూ. 3.27 లక్షల కోట్లకు చేరింది. ఇది 8 రెట్లు పెరిగింది. 2014-–15లో దేశంలో అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 26 శాతం మాత్రమే భారత్‌‌లో తయారయ్యేవి.  ఇప్పుడు, భారతదేశంలో అమ్ముడయ్యే అన్ని మొబైల్ ఫోన్లలో 99.2 శాతం ఇక్కడే తయారవుతున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీ విలువ 2014లో రూ. 18,900 కోట్ల నుంచి  2024లో రూ. 4,22,000 కోట్లకు పెరిగిందని గోయల్ తెలిపారు.