సందర్శకులను ఆకట్టుకుంటున్న ఏనుగుల పార్కు

సందర్శకులను ఆకట్టుకుంటున్న ఏనుగుల పార్కు

కొన్ని జూపార్కుల్లో మనం ఏనుగుల్ని చూస్తుంటాం. కానీ, ఎనుగుల జూపార్క్ చాలామంది చూసుండరు. ఏనుగుల పార్క్ను ఎప్పుడైనా చూసారా?  ఏదైనా జూపార్క్ లో చూసుంటారు. కాని దట్టమైన అడవి ప్రాంతంలో చుట్టూ అందమైన కొండల నడుమ ముచ్చటగా ఉండే ఏనుగులను చూసి ఉండరు.. పైగా వాటికి ఘనమైన చరిత్ర కల్గి ఉండటం మరింత విశిష్టతను చాటుతుంది. ఈ ఏనుగుల పార్క్ ను చూడాలంటే తెలంగాణలోని కొమురంభీం జిల్లాకు అతీ సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీప్రాంతానికి వెళ్ళాల్సిందే.. సందడి చేస్తున్న ఏనుగుల గుంపును చూసేద్దాము.
 
ఏనుగుల పేరు చెప్పగానే మనకు శ్రీకాకుళం, విజయనగరం, కేరళ గుర్తుకు వస్తాయి. ఉత్తరాంధ్రలో అప్పుడప్పుడు పంట చేలపై ఎనుగులు దాడి చేస్తుంటాయి. అయితే ఎలాంటి  హాని చేయని అమాయక ఏనుగులు ఎక్కడుంటాయో చూడాలంటే తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుకు వెళ్లాల్సిందే. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి  నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఏనుగుల పార్క్ ఉంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని ఈ ఏనుగుల పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీప్రాంతంలో చుట్టూగుట్టలు.. చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్కును ఏర్పాటు చేశారు. గడ్చిరోలి జిల్లా కమలాపూర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగుల పార్క్ దగ్గర  2 కోట్లతో కాటేజీలు, చిన్న షెడ్ల నిర్మాణం చేపట్టింది మహారాష్ట్ర అటవీశాఖ. సందర్శకుల విడిదికి వీటిని ఏర్పాటు చేసింది. సోషల్మీడియా వల్ల పార్క్ ప్రచారంలోకి రావడంతో  సందర్శకుల తాకిడి పెరిగింది. 

1908లో బ్రిటిష్ పాలకుల కాలంలో ఏనుగులను వివిధ రకాల పనులకు వాడేవారు. ఇక్కడి విలువైన ప్రకృతి సంపదను ఇంగ్లండ్కు తరలించేందుకు పెద్దపెద్ద యంత్రాలు లేకపోవడంతో ఏనుగులను ఉపయోగించేవాళ్లు. 1965లో ఆళ్లపల్లి అడవిలో 4 ఏనుగులు మిగిలాయి. వీటిని కమలాపూర్కు తీసుకువచ్చారు. జంతువులతో పనులు చేయించరాదని ఉన్నత న్యాయంస్థానం ఆదేశించడంతో   ఏనుగుల సంరక్షణ బాధ్యతను మహారాష్ట్ర అటవీశాఖ చూస్తోంది.  
 
కమలాపూర్ అడవిలో ప్రస్తుతం పది ఏనుగులు ఉన్నాయి. ఇందులో రెండు చిన్న ఏనుగులు. వీటిలో పెద్ద ఏనుగుకు 90 సంవత్సరాలకుపైగా వయసు ఉంటుందంటున్నారు ఫారెస్టు గార్డులు.. మరొకదనికి 87 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు.  ఎనుగుల్లో బసంతి అత్యధికంగా 15 అడుగుల ఎత్తుతో ఉంది. మిగతావి 8–12 అడుగుల వరకు ఉన్నాయి. వీటికి రోజూ 50 కిలోల బియ్యంతో ఆహారం వండిపెడతారు. నూనె, ఉప్పు కలిపి రెండు కిలోలకు ఒక ముద్దను అందుబాటులో ఉంచుతారు.  గోధుమ పిండినికూడా ముద్దలుగా చేసి పెడతారు. అడవిలో కంక బొంగులు, వాటి ఆకులు, దుంపిడి, టేకు ఆకులు, మద్ది ఆకులను ఏనుగులు తింటాయి.  మధ్యాహ్నం 12 గంటలకు ఆహారం తినేందుకు వచ్చే ఏనుగులు 3 గంటల వరకు ఆహారం తిని చెరువు దగ్గరి నుంచి తిరిగి అడవిలోకి వెళ్తాయి. ఈ పార్కుకు వెళ్లాలంటే  కాగజ్నగర్ నుంచి చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం మీదుగా అంతర్రాష్ట్ర వంతెన దాటాలి.  వీకెండ్స్ లో ఈ ఏనుగులను చూడటానికి సందర్శకులు వస్తుంటారు.. పార్క్ లో  ఎలాంటి టిక్కెట్ ఉండదు. ఇక్కడి వాతావరణం చాలాబాగుందంటున్నారు సందర్శకులు.  కుమ్రంభీం ఆసిఫాబాద్,  మంచిర్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాలు, హైదరాబాదు, వరంగల్, కాళేశ్వరం, కరీంనగర్ పట్టణాల నుంచి సందర్శకులు  ఎనుగులు చూసేందుకు పార్క్ కు వస్తుంటారు.