- సీఎం కస్టోడియన్‌లా కాకుండా రియల్టర్‌లా ఆలోచిస్తున్నరు: ఏలేటి
- తమ సర్కారు వచ్చాక దీనిపై విచారణ చేయిస్తమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌లా ఉండాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. రియల్టర్అవతారమెత్తారని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భూ బకాసురుల రాజ్యం నడుపుతున్నారని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ ముసుగులో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ తెరలేపారన్నారు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని డిజైన్ చేసిన ఈ స్కామ్ విలువ అక్షరాలా రూ.6.29 లక్షల కోట్లు అని ఆరోపించా. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి టీం.. ముందుగానే 22 పారిశ్రామికవాడల్లో రెక్కీ నిర్వహించిందని, అక్కడున్న సంస్థల యజమానులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నాకే కేబినెట్‌లో హిల్ట్ పాలసీకి ఆమోదం తెలిపారన్నారు.
ఇది ముమ్మాటికీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్ అని ఆరోపించారు. రూ.6.29 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను కేవలం రూ.5 వేల కోట్లకు దారాధత్తం చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక వాడల్లోని భూముల ఓనర్లకు ఫ్రీ హోల్డ్ ఇచ్చి లూటీకి కిటికీలు తెరిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తలుపులు బార్లా తెరిచిందన్నారు. పారిశ్రామిక వాడల భూములను కొల్లగొట్టేలా ఉన్న జీవో-27ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి.. హిల్ట్ పాలసీపై లోతైన చర్చ జరపాలన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే హైదరాబాద్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ ల్యాండ్ లూటింగ్’ ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ భూ దందాపై ఇప్పటి వరకు మంత్రులు నోరు మెదపకపోవడం చూస్తుంటే.. వారు కూడా నజరానాల కోసమే పని చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ స్కామ్‌పై విచారణ జరిపి.. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్‌లోని స్కామ్‌స్టర్లను జైలుకు పంపడం ఖాయమని ఏలేటి హెచ్చరించారు.
