
- సదరం సర్టిఫికెట్ టైమ్ కు ఇవ్వట్లేదు!
- క్యాంపు పూర్తయినా నెలల తరబడి లేట్
- కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న దివ్యాంగులు
- ఆస్పత్రుల్లో పెండింగ్తోనే జారీ ఆలస్యమంటున్న అధికారులు
- పింఛన్కు దూరమవుతున్నామని అర్హుల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: సదరం సర్టిఫికెట్లు సమయానికి అందక అర్హులైన దివ్యాంగులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ పరేషాన్ అవుతున్నారు.హైదరాబాద్ జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు వైద్యారోగ్యశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసిన గంటలోపే బుకింగ్స్ అయిపోతున్నాయి. దీంతో నెలల తరబడి మీ సేవసెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. స్లాట్లు బుక్ చేసుకొని క్యాంపులో చెకప్ లు పూర్తయినా కూడా సర్టిఫికెట్లు టైమ్‌కు ఇవ్వడంలేదు. వారం రోజుల్లో అందించాల్సి ఉన్నా కొందరికి నెలల తరబడిగా రాకపో తుండగా అర్హులు పింఛన్ కు దూరమవుతున్నారు. స్కూల్స్‌లోనూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు దివ్యాంగ స్టూడెంట్స్ఇబ్బందులు పడుతున్నారు.
ఇతరుల సాయం లేకుండా కలెక్టరేట్ కి రాలేని పరిస్థితిలో ఉన్నా.. ఎన్నిసార్లు తిరుగుతున్నా ఆస్పత్రుల నుంచి ఇంకా రాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. క్యాంపుల్లో స్లాట్ బుకింగ్ నుంచి చెకప్ లు పూర్తయినా కూడా సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం చేస్తున్నారని దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరం క్యాంపుల్లో చెకప్ లు అయిన వెంటనే ఆస్పత్రిలోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆరు ఆస్పత్రుల్లో క్యాంపులు
సిటీలోని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో సోమవారం, కోఠి ఈఎన్ టీలో మంగళవారం, మెహిదీపట్నం సరోజినిదేవీ కంటి దవాఖానలో బుధవారం, నిలోఫర్, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రుల్లో గురువారం, మలక్ పేట్ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా 27న వచ్చే నెలకు సంబంధించిన స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తున్నారు. ఇందులో నిలోఫర్ తో పాటు మరిన్ని హాస్పిటల్స్ కు నెలకు120 స్లాట్లు ఇస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఫిజికల్ హ్యాండీ క్యాప్ వారికి ఆర్థోపెడిక్ సంబంధించి మలక్ పేట్, కింగ్ కోఠిలో టెస్ట్ లు చేస్తున్నారు. ఆయా ఆస్పత్రులకు నెలకు 240 మందికి స్లాట్లు అందిస్తున్నారు. మిగతా వాటిలో ఒక్కో హాస్పిటల్ కి 45 చొప్పున కేటాయిస్తున్నారు.
స్లాట్లు రిలీజ్ చేసిన వెంటనే అన్ని పూర్తి అవుతున్నాయి. బుకింగ్ చేసుకోకపోతే సదరం క్యాంపునకు హాజరు అయ్యే అవకాశం లేదు. దీంతో అర్హత ఉన్నా పెన్షన్ అందుకోలేకపోతున్నామని దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇలా స్లాట్ దొరక్క ప్రతి నెలా ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
పింఛన్ పెంపు కారణంగా..
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ రూ.3016 నుంచి రూ.4016 కి పెంచి అందిస్తుంది. దీంతో అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకుని క్యాంపుల్లో టెస్ట్ లు చేయించుకుం టున్నారు. సర్టిఫికెట్లు సకాలంలో జారీ చేయకపోతుండగా లబ్ధిదారులు పింఛన్ కు దూరమవుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సదరం సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కాకుండా చూడాలని దివ్యాంగులు వేడుకుంటున్నారు. స్లాట్ల సంఖ్య పెంచడంతో పాటు అన్ని దవాఖానల్లో క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు.
జీతాలు ఇవ్వకపోవడంతోనే ఆలస్యం?
సదరం క్యాంపులను నిర్వహించే ఆస్పత్రుల్లో అందుబాటులో లేని డిపార్టుమెంట్ డాక్టర్లను ప్రైవేట్ నుంచి తీసుకొస్తున్నారు. వీరికి రెండేళ్లుగా జీతాలు ఇవ్వకపోతుండగా సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం అయితున్నట్టు తెలిసింది. నిలోఫర్ ఆస్పత్రిలో సైక్రియాట్రిస్ట్ లేకపోవడంతో ప్రైవేటు డాక్టర్‌ను తీసుకొచ్చి టెస్ట్ లు చేయిస్తున్నారు. ఇలా అక్కడ చేస్తున్న డాక్టర్ కు రెండేళ్లుగా జీతం రావడంలేదు. దీంతో ఆయన సంతకం చేయకపోతుండ గానే చాలా సర్టిఫికెట్లు పెండింగ్ లో ఉన్నట్టు ఇటీవల అధికారులు గుర్తించారు. మరోవైపు దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.