సన్ లైట్లోనే మీటింగ్స్​.. పాక్లో కరెంట్​ బంద్​ 

సన్ లైట్లోనే మీటింగ్స్​.. పాక్లో కరెంట్​ బంద్​ 

దాయాదిదేశం పాకిస్తాన్​ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతున్న  విషయం  తెలిసిందే.  నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్​ లో విద్యుత్​ సంక్షోభం నెలకొన్నది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆ దేశం విద్యుత్​ ఆంక్షలు విధించింది. చివరకు అధికారులు, దేశంలోని కీలక మంత్రులు సైతం సన్​ లైట్​లోనే  విధులు నిర్వహించాలని ఆ దేశం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు ప్రజలు విద్యుత్​ వినియోగం తగ్గించాలని.. త్వరగా పడుకొని.. త్వరగా నిద్రలేవాలని ఆ దేశ అధికారులు పిలుపునిస్తుండటం గమనార్హం. ఇక ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారి అమెరికాలోని రాయబార కార్యాలయాలను సైతం అమ్మేయాలని పాక్​ నిర్ణయం తీసుకున్నది. 

సంక్షోభానికి కారణం ఇదేనా? 

దిగుమతులు మీద ఎక్కువగా ఆధారపడి రావడంతోనే పాక్ లో సంక్షోభం ఏర్పడిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్​ ప్రధానంగా వంటనూనెను దిగుమతి చేసుకుంటోంది. అయితే నిధుల కొరత కారణంగా ప్రస్తుతం దిగుమతి తగ్గిపోయింది. దీంతో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంట నూనెల నిల్వలు ఉన్నప్పటికీ.. వాటిని బయటకు తీసుకొచ్చేందుకు బ్యాంకుల నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మైన వంట నూనె కొరత ఏర్పడింది. ఇప్పటికే భారీగా వంట నూనె ధరలు పెరగగా.. భవిష్యత్​ లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరదలే పాకిస్తాన్​ కొంపముంచాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా వరదలు రావడంతో దేశంలోని మూడో వంతు భాగం ముంపునకు గురైంది. దీంతో వ్యవసాయ ఉత్పత్తి భారీ స్థాయిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో పాక్​ ఎగుమతులు పడిపోయాయి. ప్రస్తుతం ఆ దేశం దిగుమతుల మీదే ఆధారపడి పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం పాకిస్తాన్​ వద్ద విదేశీ మారక నిల్వలు 5. 5 మిలియన్​ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలవైపు మొగ్గుచూపుతోంది. 

విద్యుత్​ ఆంక్షలు  ఎందుకంటే.. 

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పాకిస్తాన్​ కేబినెట్​ విద్యుత్​ ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్​ వాడకాన్ని 30 శాతం తగ్గించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా మాల్స్​, మార్కెట్లు రాత్రి 8.30 నిమిషాల వరకే బంద్​ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  రాత్రి 10 గంటలకే ఫంక్షన్ హాల్స్ మూసివేయనున్నారు. ప్రస్తుత పరిస్థితి పట్ల పాక్​ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం, గ్యాస్‌ నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం కావడంతో పాకిస్తాన్​ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.  ఎనర్జీ సేవింగ్ ప్లాన్‌ లో భాగంగా విద్యుత్​ ను ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. 

రాయబార కార్యాలయాలు ఫర్​ సేల్​ 

పాకిస్తాన్​ ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారింది. అమెరికాలోని రాయబార కార్యాలయాలను అమ్మేయాలని ఆ దేశం నిర్ణయం తీసుకున్నది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇందన పొదుపు పాటించాలని నిర్ణయం తీసుకున్న పాక్​.. ఫ్యాన్లు, బల్బుల తయారీ మీద నిషేధం విధించింది. కాగా పాక్​ ప్రభుత్వ తీరుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు సైతం ఆందోళన చెందుతున్నారు.