అయ్యో పాపం.. గేటు లాక్ చేసేందుకు నీటిలోకి దిగి ఉద్యోగి మృతి

అయ్యో పాపం..  గేటు లాక్ చేసేందుకు నీటిలోకి దిగి ఉద్యోగి మృతి
  • సూర్యాపేట జిల్లాలోని ఎన్ఎటీఎల్ పవర్ ప్లాంట్​లో ప్రమాదం 

మఠంపల్లి, వెలుగు: పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో ఉద్యోగి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.  వివరాలు ఇలా ఉన్నాయి. మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామ శివారులోని వేములేరు వాగుపై నిర్మించిన ఎన్ఎటీఎల్ పవర్ ప్లాంట్ లో నేరేడుచర్ల మండలం కందులవారిగూడెం పరిధి పీర్ సాహెబ్ గూడేనికి చెందిన షేక్ ఉస్మాన్(35) పని చేస్తున్నాడు.

 సోమవారం మధ్యాహ్నం పవర్ ప్లాంట్ లోని మూడు క్రషర్ గేట్లలో రిపేర్ పనులను చేస్తున్నారు. ఒక గేటును పైకి లేపేందుకు దాని కింద లాక్ కు తాడు కట్టేందుకు ఉస్మాన్ నీటిలోకి దిగాడు.ఆ సమయంలో పై నుంచి వచ్చిన నీటి ఒత్తిడికి అతడు గేట్ల మధ్య ఇరుక్కుపోయి గల్లంతు అయ్యాడు. 

హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్ఐ బాబు వెళ్లి నాగార్జునసాగర్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. అర్ధరాత్రి సమయంలో ఉస్మాన్ డెడ్ బాడీని గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం  హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి 
దర్యాప్తు చేస్తున్నారు.