3 నెలలుగా జీతాలు ఇస్తలేరు

3 నెలలుగా జీతాలు ఇస్తలేరు

మేడ్చల్: జీతాలు చెల్లించడం లేదంటూ కీసర గ్రామ పంచాయతీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. కీసర రోడ్డుపై ఉన్న షాపుల ముందు జోలె పట్టుకొని భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదంటూ వారం కిందట వారంతా ధర్నాకు దిగారు. అయితే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఉద్యోగులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీపీ ఉద్యోగులు తమ ఆందోళనను విరమించారు. అయితే వారం గడిచినా  ఇంకా జీతాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు మళ్లీ నిరసన బాట పట్టారు. ఈసారి వినూత్నంగా జోలె పట్టి షాపుల ముందు భిక్షాటన చేశారు. తక్షణమే తమ జీతాలు విడుదల చేయకపోతే గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తామని కార్మికుల నాయకులు హెచ్చరించారు. 

కావాలనే ఉద్యోగులు ధర్నా చేస్తుండ్రు

ఈ నెల 7న  జీతాల కోసం ట్రెజరీలో డబ్బు వేశామని, కావాలనే జీపీ కార్మికులు ధర్నా చేస్తున్నారని సర్పంచ్ మాధూరి వెంకటేశ్ ఆరోపించారు. మరో రెండు రోజుల్లో వాళ్ల అకౌంట్లలో జీతాలు డిపాజిట్ అవుతాయని, కానీ బీజేపీ నాయకుల మాటలు విని కార్మికులు భిక్షాటనకు దిగారని అన్నారు. గ్రామస్థులు సకాలంలో ట్యాక్స్ కట్టకపోయినా ఉద్యోగులకు జీతాలు ఏనాడు ఆపలేదని సర్పంచ్ స్పష్టం చేశారు.