- ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై సర్కారు నాన్చుడు ధోరణి
- మార్పులు చేయాలని రెండున్నరేండ్లుగా కోరుతున్న ఎంప్లాయీస్
- 1 శాతం బేసిక్ పే ఇస్తామని అంటున్నా పట్టించుకుంటలే
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్, రీయింబర్స్‌మెంట్‌కు ఉద్యోగులు, పెన్షనర్ల తిప్పలు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంలో రాష్ట్ర సర్కార్ నాన్చుడు ధోరణి కొనసాగిస్తోంది. ప్రపోజల్స్ అందినా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. రెండున్నరేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోపిస్తున్నారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఈహెచ్ఎస్ సేవలు అందడం లేదని, స్కీమ్‌లో మార్పులు చేసేందుకు తమ బేసిక్ పే నుంచి 1 శాతం చొప్పున ప్రతి నెల చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చాయి. దీనిపై మూడు సార్లు ప్రభుత్వానికి అంగీకార లెటర్‌ను అందజేశాయి. ఈహెచ్ఎస్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడంపై హెల్త్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు ఇటీవల కొన్ని సూచనలు కూడా చేశాయి. పీఆర్సీ రిపోర్టులోనూ ఉద్యోగుల శాలరీలో, పెన్షన్‌లో ఒక శాతం బేసిక్ పేను సపరేట్ రిజర్వ్ పేరుతో తీసుకునే విషయాన్ని ప్రస్తావించాయి. ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నాయో స్టడీ చేయాలని కోరాయి. అయితే ఇప్పుడు ఏమైనా నిర్ణయం తీసుకుంటేనే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈహెచ్ఎస్ కొత్తగా అమలవుతుందని, లేదంటే ఇంకా లేట్ అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు.
వైద్య సేవలు పొందేందుకు ఇక్కట్లు
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వెల్‌నెస్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఏవైనా సర్జరీలు, ఇతర ట్రీట్‌మెంట్స్ కోసం ఈహెచ్‌ఎస్‌లో ఎంప్యానల్ అయిన ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఇలా ఉద్యోగులు కార్పొరేట్ చికిత్స పొందేందుకు అవకాశం ఉండేది. అయితే అన్ని ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందడం లేదు. బిల్లులు రావడం లేదనే సాకుతో ఉద్యోగులకు వైద్య సేవలందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ వెనుకాడుతున్నాయి. దీంతో ఉద్యోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి, డబ్బు కట్టి ట్రీట్‌మెంట్ తీసుకుని, వైద్య ఖర్చుల బిల్లులను హెచ్ఓడీకి ఇస్తే, ఆ బిల్లులను ప్రభుత్వం రీయంబర్స్ చేస్తోంది. ఈ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. అందులో భాగంగానే ఈహెచ్ఎస్, రీయింబర్స్మెంట్ కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందేలా తమ కాంట్రిబ్యూషన్ తీసుకుని సహరించాలని ఉద్యోగులు కోరుతూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షన్ తీసుకునేవాళ్లు డిపెండెంట్లు కలిపితే దాదాపు 13 లక్షల మంది ఉన్నారు.
ఆర్థిక భారం పడుతుందనేనా?
ఈహెచ్ఎస్, రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా రాష్ట్ర సర్కార్ తనకు నచ్చినప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఒక్క శాతం కాంట్రిబ్యూషన్ తీసుకుని స్కీం పూర్తి స్థాయిలో అమలు చేస్తే ప్రభుత్వంపై ఇంకొంత భారం పడుతుందనే కారణంతో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా ఏటా సగటున రూ.300 కోట్లు అవుతున్నాయి. ఒక్క బిల్లు రీయింబర్స్ చేసేందుకు కనీసం ఆరు నెలల టైం పడుతోంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్న దాని ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే నుంచి ఒక శాతం తీసుకుని, రాష్ట్ర సర్కార్ మరికొంత కలిపి ఈ స్కీం కంప్లీట్‌గా అమలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వంపై మరో రూ.200 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. దీంతో స్కీంకు అడుగులు ముందుకు పడటం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పుడు రూ.50 వేల బిల్లుల దాకా జిల్లా హాస్పిటల్స్, ఆపైన అయితే డీఎంఈ పరిధిలో రీయింబర్స్‌మెంట్‌కు స్ర్కూటినీ చేస్తున్నరు.
