స్వయం సహాయక మహిళలకు చేయూత .. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామ్యం

స్వయం సహాయక  మహిళలకు చేయూత .. ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగస్వామ్యం
  • బల్దియా పార్కులు, గ్రౌండ్స్​నిర్వహణ బాధ్యతల అప్పగింత 
  • బస్తీలు, కాలనీల్లో నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ
  • కేంద్ర పథకం ‘-అమృత్​ మిత్ర’లో భాగం చేయాలని నిర్ణయం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలోని బస్తీలు, కాలనీల్లోని పేద మహిళలకు చేయూతనిచ్చేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్​హెల్ప్​గ్రూపు మహిళల అభ్యున్నతి కోసం ‘అమృత్​ మిత్ర’ పథకాన్ని అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది. ఈ స్కీంలో భాగంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో సెల్ఫ్​హెల్ప్​గ్రూపు మహిళలను భాగస్వాములను చేయడం ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని భావిస్తోంది. మున్సిపల్​శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్​పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పలు ముఖ్యమైన విభాగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. 

మున్సిపల్​శాఖతో పాటు తెలంగాణ మిషన్​ఫర్​ఎలిమినేషన్​ఆఫ్​పావర్టీ ఇన్​మున్సిపల్​ఏరియాస్​(ఎంఈపీఎంఏ), తెలంగాణ అర్బన్​ఫైనాన్స్​అండ్​ఇన్​ఫ్రాస్ర్టక్చర్​డెవలప్​మెట్​కార్పొరేషన్(టీయూఎఫ్​ఐడీసీ) సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. అలాగే గ్రేటర్​పరిధిలోని మున్సిపల్​కార్పొరేషన్, మెట్రోవాటర్​బోర్డు పరిధిలోని కొన్ని కీలకమైన పనులను స్వయం సహాయక బృందాల ద్వారా నిర్వహింపజేయాలని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంఏయూడీ అధికారులు ఆయా సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. ముఖ్యమైన విభాగాల్లో మహిళలు చాలా సులభంగా చేయగలిగిన పనులను వారికి కేటాయించాలని ఆదేశించారు.  

కేటాయించే పనులివే.. 

సెల్ఫ్​హెల్ప్​గ్రూపు మహిళలకు బల్దియా ద్వారా పార్కులు, క్రీడామైదానాల నిర్వహణను అప్పగించాలని నిర్ణయించారు. వాటర్​బోర్డు నీటి సరఫరా చేసే టైంలో ఆయా బస్తీలు, కాలనీల్లో పర్యటించి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం, మురుగునీటి, మంచినీటి పైప్​లైన్ల లీకేజీల గురించి అధికారులకు సమాచారం ఇవ్వడం, నీటి సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి అధికారులకు తెలియజేయడం వంటి బాధ్యతలు కట్టబెట్టనున్నారు. చదువుకోని వారైనా ఈ పనులు సులువుగా నిర్వహించవచ్చని చెప్తున్నారు. 

ఈ పనులు అప్పగించడం వల్ల స్వయం సహాయక గ్రూపులకు ఆదాయం పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పేదరిక నిర్మూలన కూడా అమృత్​ మిత్ర పథకం ప్రధాన లక్ష్యమని, అది కూడా నెరవేరుతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్​దయాళ్​అంత్యోదయ యోజన– నేషనల్ అర్బన్ లైవ్​లీ హుడ్స్​ మిషన్(డీఏవైఎన్​యుఎల్ఎం) స్కీం కింద ఆయా సంస్థలకు నిధులు అందుతాయని అధికారులు తెలిపారు.