అడవిని ఆక్రమించిన గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వొద్దు : ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్

అడవిని ఆక్రమించిన గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వొద్దు : ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్

ర క్షిత అడవులను ఆక్రమించి అక్కడ చెట్లను నరికి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు. దట్టమైన అడవులు ముఖ్యంగా నదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అడవులను కాపాడడానికి1927లో భారత అటవీ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం దట్టమైన చెట్లతో ఉన్న ప్రభుత్వ భూభాగాన్ని రక్షిత అడవులుగా గుర్తించారు. ఆ అడవుల ఆక్రమణ, చెట్లను నరికి వ్యవసాయం చేయడం నేరం. ఈ చట్టం స్థానిక గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేయడాన్ని నేరంగా పరిగణించింది. దీంతో గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.1930 దశకంలో గిరిజన నాయకుడు కుమ్రం భీమ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం అదుపు తప్పి పోలీసు కాల్పుల్లో కుమ్రం భీమ్ చనిపోయారు. తర్వాత నిజాం ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి1940 నాటికి అడవి ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్న అందరు గిరిజనులు, ముఖ్యంగా గోండు, కొలాం, చెంచు వంటి గిరిజన తెగలకు సుమారు 50 వేల ఎకరాల అటవీభూమిని పట్టాలుగా ఇచ్చింది. 

సుప్రీంకు చెప్పినదానికి భిన్నంగా..

అటవీ హక్కుల చట్టం 2006 కొన్ని రాష్ట్రాల్లో సరిగా అమలు కాలేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. స్పందించిన కోర్టు అటవీహక్కుల చట్టం ఏవిధంగా అమలైందని ఒక అఫిడవిట్ ద్వారా తెలపాలని అన్ని రాష్ట్రాలను కోరింది. రాష్ట్రంలో అటవీహక్కుల చట్టం పకడ్బందీగా అమలైందని, అర్హులైన అందరికీ పట్టాలు ఇవ్వడం పూర్తయిందని 2017లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇంత వరకు బాగానే ఉన్నా..  

రాష్ట్ర గిరిజన శాఖలో పైరవీలు జరిగి, చట్టం సరిగా అమలు కాలేదని(సుప్రీం కోర్టుకు తెలిపిన దానికి భిన్నంగా) మళ్లీ ఎవరైనా 2005 కు ముందు పోడు చేసుకుంటున్న వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని 2021 నవంబర్​లో మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇదే అదనుగా పెద్ద ఎత్తున అటవీ భూముల ఆక్రమణలు జరిగాయి. అడ్డం వచ్చిన అటవీ అధికారులపై దౌర్జన్యం చేస్తూ గిరిజనేతరులు ఫారెస్ట్​ భూముల్లో పాగా వేశారు. గిరిజనేతరుల ప్రోద్భలంతో కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా12 లక్షల ఎకరాల అటవీ భూములు 2005 కంటే ముందు నుంచే పోడు వ్యవసాయంలో ఉన్నాయని, వారికి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పారు. 

అటవీ అధికారులు ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ఈ 12 లక్షల ఎకరాలు గత రెండు మూడేండ్లలోనే ఆక్రమించబడ్డాయని రుజువులతో చూపించినా, ప్రభుత్వం వాటిని లెక్కలోకి తీసుకోలేదు. ఈ విషయంలో చాలామంది అటవీ అధికారులను భయబ్రాంతులకు గురిచేయడం, కొందరిని రాత్రికి రాత్రే బదిలీ చేయడం వంటివి జరిగాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ12 లక్షల ఎకరాల ఆక్రమిత అటవీ భూములను పట్టా చేయాలని చూస్తున్నది. స్వయాన రాష్ట్ర సీఎం అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం. రేపో మాపో పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది.

అర్హులకు న్యాయం జరగాల్సిందే..

తెలంగాణ రాష్ట్రం కంటే అధికంగా గిరిజనులున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాలలో అటవీ భూముల ఆక్రమణ పోడు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లేదు. కేవలం తెలంగాణలోనే ఇలా బాధ్యతారహితంగా లబ్ధిదారులు గిరిజనులా? గిరిజనేతరులా? ఇతర రాష్ట్రాల వారా? అనేది చూడకుండా12 లక్షల ఆక్రమిత అటవీ భూములు పట్టాలు చేస్తున్నారు. గత మూడు దఫాలుగా పోడు భూములను పట్టాలు చేసినా, వాటిలో కొంత భాగం ఇతరుల చేతుల్లోకి వెళ్లి పోయింది. గిరిజనులకు సహాయ సహకారాలు అందించాలి అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే వారి జీవనోపాధికి వారు వ్యవసాయం చేస్తున్న అటవీ భూములకూ పట్టాలు ఇవ్వాలి. అది దృష్టిలో ఉంచుకొని మూడుసార్లు అటవీభూములు పట్టాలు చేశారు. ఇప్పటికి కూడా ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు 2005కు ముందు ఆక్రమిత అడవుల్లో వ్యవసాయం చేస్తుంటే వారికి అన్యాయం జరగకుండా చూడాలి. 

కానీ గిరిజనుల పేరుతో గిరిజనేతరులు, అలాగే పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారు అడవి ఆక్రమిస్తే ఒప్పుకొనేది లేదు. ఇప్పుడు చాలామంది గిరిజనేతరులు గిరిజన శాఖ ద్వారా తప్పుడు సమాచారంతో అటవీ భూములను కబ్జా చేసి ఉన్నారు. ప్రభుత్వం శాస్త్రీయపద్ధతిలో ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా 2005కు ముందు నుంచి అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలి. అలాగే పోడు భూముల్లో పట్టాలు ఇచ్చిన వారికి ప్రభుత్వ ఖర్చుతో కొంత భాగం పండ్లు, ఇతర ఫలసాయాన్ని ఇచ్చే చెట్లను పెంచడానికి ప్రణాళిక (వనవ్యవసాయం/అగ్రో ఫారెస్ట్రీ) రచించి అమలు చేస్తే కొద్దిలో కొద్దిగా అడవులు రక్షించబడతాయి. పోడు భూముల పట్టాదారులకు రైతుబంధు ఇవ్వడం స్వాగతించాలి. సమాజంలో ఉన్న విద్యావంతులు, పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున అడవుల ఆక్రమణ, గిరిజనేతరుల ఆక్రమిత పోడు వ్యవసాయంపై తమ గళం విప్పాల్సిన అవసరముంది. రాజకీయ పార్టీలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అటవీ ఆక్రమణలను ఉపేక్షించవద్దు.

అందరికీ పట్టాలిచ్చామని చెప్పి.. మళ్లీ పట్టాలిస్తున్నారా?

అడవుల్లో నివసిస్తున్న గిరిజనులకు అడవుల నుంచి వచ్చే ఫలసాయంపై పూర్తి హక్కు ఉంది. కానీ అటవీ భూములు ప్రభుత్వానివి. అంటే ప్రజలందరివి. అడవులను కాపాడి భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాగే అడవులను రక్షించి పర్యావరణానికి హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గిరిజనుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని వీరు, వారు అనకుండా అన్ని రాజకీయ పార్టీలు పోడుభూముల పట్టాలు చేయాలని చూస్తున్నాయి. కొందరు నేతలు అడవుల ఆక్రమణలను ప్రోత్సహిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. అందులో నుంచి ప్రస్తుతం12 లక్షల ఎకరాల అటవీ భూములను పట్టాలు చేస్తున్నారు. 

అంటే ఎన్నికల పుణ్యాన రాష్ట్ర అడవిలో నుంచి సుమారు 20 శాతం అటవీ భూములు తగ్గిపోతాయి. ప్రస్తుతం ఇస్తున్న ఈ12 లక్షల పోడుభూముల పట్టాలు.. అంతటితో ఆగకుండా మరిన్ని అడవుల ఆక్రమణకు ఊతమిచ్చే ప్రమాదముంది. పోడు భూముల పట్టాలు రావణ కాష్టంలా మండుతూనే ఉంటుంది. ఇలా ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు పోడు భూముల పట్టాలు సమస్యగా తయారైతే.. వచ్చే 50 ఏండ్లలో రాష్ట్రంలో అడవులంటూ ఏమీ మిగలవు.  అర్హులైన అందరు గిరిజనులకు పట్టాలు ఇచ్చామని, రాష్ట్రంలో చట్టం పకడ్బందీగా అమలుచేశామని 2017లో తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకు చెప్పినా, గిరిజన శాఖ ఇప్పుడు ఇంకా12 లక్షల పోడు భూములున్నాయని వాటిని పట్టాలు చేయాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

స్వాతంత్ర్యం తర్వాత..

1950 తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోకి జనాలు వచ్చి అడవులు నరికి పోడు వ్యవసాయం మొదలు పెట్టారు. ఇలా1970 వరకు సుమారు 2.5 లక్షల ఎకరాల అటవీభూములు నరికేసి పోడు వ్యవసాయం చేశారని కొన్ని సర్వే రిపోర్టుల ద్వారా తెలిసింది. స్థానిక గిరిజనులేగాక మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో కలిపి అడవులను ఆక్రమించిన అందరికి గంపగుత్తగా 2.5 లక్షల ఎకరాల అటవీ భూములకు1970లో పట్టాలు ఇచ్చారు. ఈ చర్యతో ఇక అడవుల ఆక్రమణ, చెట్లు నరికివేత ఆగిపోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆక్రమించిన అటవీభూమి పట్టా కాకపోతుందా? అని ఇంకా పెద్ద ఎత్తున అడవులు నరకడం, పోడు వ్యవసాయం చేయడం మొదలైంది. 

అడవుల ఆక్రమణ చాలా రాష్ట్రాల్లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చింది. దీన్ని అమలు చేసేందుకు పకడ్బందీగా విధి విధానాలు రూపొందించారు. ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ వరకు ఎవరైతే అటవీభూముల్లో వ్యవసాయం చేస్తున్నారో వారందరి దరఖాస్తులు పరిశీలించి పట్టాలు(భూ హక్కులు) ఇవ్వాలని చట్టం నిర్దేశించింది. అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పల్లెలో గ్రామ సభలు నిర్వహించి అడవులు ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్న వారి వివరాలు సేకరించి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో 3.08 లక్షల ఎకరాల అటవీ భూముల(సుమారు లక్ష కుటుంబాల)కు పట్టాలు ఇచ్చారు. కొందరు గిరిజనేతరుల దరఖాస్తులను ఆ సమయంలో తిరస్కరించారు. అటవీ హక్కుల చట్టం 2006 ద్వారా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న దాదాపు అందరు గిరిజనులకు, ఆదివాసీలకు న్యాయం జరిగింది.

- ఎం. పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్