హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కులు, ప్రభుత్వ స్థలాలు, లే ఔట్లు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో చాలా చోట్ల కబ్జాల పాలయ్యాయి. రూ.కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని కోర్టు కేసుల్లో చిక్కుకున్నాయి. సిటీ 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించగా.. 400కు పైగా లే అవుట్ కాలనీలు ఉన్నాయి. వీటి ఏర్పాటు సమయంలోనే 10 శాతం భూమిని బడి, గుడి, పార్కు వంటి అవసరాలకు కేటాయించారు.
వాటికి సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఆక్రమించేశారు. నాలుగేండ్ల కింద కార్పొరేషన్ ఆఫీసర్లు సిటీలో ప్రభుత్వ భూముల గుర్తింపునకు సర్వే చేశారు. పార్కులు, లే అవుట్, ఖాళీ స్థలాలు, ఓపెన్ ల్యాండ్స్ అన్నీ కలిపి 371 ఉన్నట్లు గుర్తించారు. వీటిలో159 భూములకు సరైన రక్షణ చర్యల్లేవు. అప్పట్లోనే వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని హడావుడి చేసిన ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు.
రూ.కోట్ల విలువైన భూములు కబ్జా
హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ సిటీకి ప్రాధాన్యత ఉండడంతో ఇక్కడ గజం విలువ రూ.వేల నుంచి రూ.లక్షల్లోకి చేరింది. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు పార్కులు, లే అవుట్ ఖాళీ స్థలాలను ఆక్రమించడంతో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి.
హనుమకొండ బాలసముద్రంలోని సర్వే నంబర్1,066లో 1968లోనే దాదాపు 200 ఎకరాల్లో లే అవుట్చేసి.. రూల్స్ మేరకు 20 ఎకరాలకుపైగా భూమిని పార్కులు, ఇతర అవసరాలకు వదిలారు. ప్రస్తుతం అందులో చాలావరకు ఆక్రమణల పాలయ్యాయి.
అదే సర్వే నంబర్ లో దాదాపు రూ.10 కోట్లు విలువైన ఓపెన్ ల్యాండ్ ను కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, గ్రేటర్ మున్సిపల్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకుని కాంపౌండ్ వాల్ నిర్మించారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా ఆఫీస్ ను కూడా పార్కు స్థలంలోనే నిర్మించారని ఆరోపిస్తూ.. గతేడాది వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఏకశిలా పార్కు సమీపంలోని ఖాళీ స్థలాలు కబ్జా అయ్యాయి. వడ్డేపల్లి సమీపంలో శ్మశానవాటిక స్థలాన్ని కొందరు ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నారు. దీంతో వాటిపై వివాదాలు నడుస్తున్నాయి. ఇటీవల వరంగల్ లోని గొర్రెకుంట పరిధి కీర్తినగర్ లో ఆక్రమణలు జరగ్గా.. ఫీల్డ్ విజిట్ చేసిన కమిషనర్ వాటిని తొలగించాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఇలా సిటీలో చాలాచోట్ల పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేశారు. రూ.వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ కార్పొరేషన్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి సర్వేకు రెడీ అవుతున్నారు. పార్కులు, ప్రభుత్వ స్థలాలు, లే అవుట్ ఖాళీ స్థలాల పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఆయా స్థలాల కాలనీ, సర్వే నంబర్లు, లే అవుట్ డీపీ నంబర్లు, స్థలం విస్తీర్ణం వంటి తదితర వివరాలతో సమగ్ర రిపోర్ట్ తయారు చేయనున్నారు. అనంతరం ఓపెన్ స్పేస్ లు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారు.
అంతేకాకుండా ఇప్పటికే చాలాచోట్ల ఆక్రమణలు జరగ్గా, వాటిపైనా యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ఖాళీ స్థలాల్లో బయో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓపెన్ ల్యాండ్స్ రక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు కబ్జాదారులపైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సిటీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తంసిటీలోని ప్రభుత్వ పార్కులు, ఖాళీ స్థలాలపై రెవెన్యూ, టౌని ప్లానింగ్ ఆఫీసర్లతో సర్వే చేయిస్తాం. ఎక్కడా అక్రమాలు జరగకుండా స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ స్థలాల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటాం.- చాహత్ బాజ్ పాయ్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్
