ఏనుగు’ దారి ఎటు..కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్​లకు దూరం

ఏనుగు’ దారి ఎటు..కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్​లకు దూరం

కామారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి కొద్దిరోజులుగా బీజేపీ ప్రోగ్రామ్​లకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆయన అనుచరులు కాంగ్రెస్​లో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏనుగు ఏ నిర్ణయం తీసుకోనున్నారనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తకర చర్చ నడుస్తోంది. 

బీఆర్ఎస్ నుంచి ప్రస్థానం..​

ఏనుగు రవీందర్​రెడ్డి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో సీనియర్​ ఎమ్మెల్యేగా, కేసీఆర్​కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉద్యమ సమయంలో  రెండు సార్లు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి పలువురు ముఖ్యనేతలను అప్పటి టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు కృషిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు రవీందర్​రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ ​నుంచి పోటీ చేసిన జాజాల సురేందర్ ​గెలిచారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 6 నెలల తర్వాత జాజాల బీఆర్ఎస్​లో చేరారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గ్రూపులు ఏర్పడ్డాయి. పార్టీ వ్యవహారాల్లో కాంగ్రెస్ ​నుంచి చేరిన సిట్టింగ్​ఎ మ్మెల్యేకు ప్రయార్టీ ఇవ్వడం ఏనుగు రవీందర్​రెడ్డికి ఇబ్బందిగా మారింది. కొద్ది రోజులకే ఈటెల రాజేందర్​ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్​ చేసి, పార్టీ నుంచి బయటకు పంపారు. ఈటెల రాజేందర్​తో  ఏనుగు రవీందర్​రెడ్డికి పార్టీ ఆవిర్భావం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏనుగు రవీందర్​రెడ్డి, ఈటెల రాజేందర్ ​వెంట నడిచారు. ఆయనతో పాటే 2021లో బీజేపీలో చేరారు. ఈటెలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పార్టీ ప్రోగ్రామ్స్​లో చురుగ్గా పాల్గొన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల టైమ్​లో ఈటెలతో కలిసి పార్టీ అప్పగించిన బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. 

మార్పుపై సమాలోచనలు..

కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో ఏనుగు రవీందర్​రెడ్డి అనుచరులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈటెల రాజేందర్​కు తాజాగా బీజేపీ హైకమాండ్​పదవి ప్రకటించినా, ఏనుగు రవీందర్​రెడ్డి మాత్రం ఆయనకు దూరంగానే ఉంటున్నారు. తన నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అనుచరుల ఒత్తిడి మేరకు పార్టీ మార్పుపై ఏనుగు రవీందర్​రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అనుచరులతో చర్చించిన తర్వాతే..  

పార్టీ మార్పుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వారంరోజులుగా ఆయన రాజస్థాన్​లో ఉన్నారు. మరో 2 రోజుల్లో ఇక్కడకి రానున్నారు. తర్వాత తన అనుచరులతో   చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా బీజేపీలో కొనసాగడమా? లేక మరో పార్టీలో చేరడమా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.