యాదగిరిగుట్టలో 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్టలో 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16 నుంచి జనవరి 15 వరకు.. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి ఉదయం 5:15 గంటల వరకు ప్రధానాలయ ముఖ మంటప ఉత్తర భాగంలో అమ్మవారిని అధిష్టింపజేసి 'తిరుప్పావై' కైంకర్యాన్ని నిర్వహించనున్నారు. 2023 జనవరి 14న రాత్రి 7 గంటలకు 'గోదాదేవి' కల్యాణం, జనవరి 15న ఉదయం 11:30 గంటలకు 'ఒడిబియ్యం' కార్యక్రమాలను చేపట్టనున్నారు. తర్వాత నిర్వహించే ప్రత్యేక పూజలతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయి.  

వైభవంగా నిత్య పూజలు

నరసింహుడి క్షేత్రంలో మంగళవారం నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. విష్ణుపుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ లో ఆంజనేయస్వామికి ఆకుపూజ నిర్వహించారు. నాగవల్లి దళాలతో అంజన్నకు ప్రత్యేక అర్చన చేశారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.21 లక్షల 685 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.10,85,200, ప్రధాన బుకింగ్ తో రూ.2,04,798, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.2 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. 

హుండీ ఆదాయం రూ.1.83 కోట్లు

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను ఆలయ సిబ్బంది మంగళవారం కౌంట్ చేశారు. 19 రోజులుగా హుండీలలో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని లెక్కించారు. ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్​కు తరలించి, కానుకలను లెక్క
పెట్టారు. ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి దగ్గరుండి పర్యవేక్షించారు. రూ.1,83,13,333 నగదు రాగా.. 124 గ్రాముల బంగారం, 3 కిలోల 50 గ్రాముల వెండి వచ్చిందని 
ఈవో చెప్పారు.