
- తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో ఏర్పాటుకు ప్రయత్నాలు
- రూ.5 వేల ‘గరుడ’ టికెట్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి
- త్వరలో ‘యాదగిరి’ పేరుతో టీవీ చానల్, మాసపత్రిక
- ఆలయ ఈవో వెంకటరావు వెల్లడి
యాదగిరిగుట్ట, వెలుగు : తిరుమలలో ఏర్పాటు చేసిన ‘శ్రీవాణి ట్రస్ట్’ తరహాలో.. యాదగిరిగుట్టలోనూ ‘గరుడ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నట్లు ఈవో వెంకట్‌రావు ప్రకటించారు. యాదగిరిగుట్టపైన శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గరుడ టికెట్ ధర రూ.5 వేలుగా నిర్ణయించగా... ఒక టికెట్‌పై ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. గరుడ టికెట్ తీసుకున్న భక్తుడికి ఉదయం సుప్రభాతసేవ నుంచి రాత్రి పవళింపుసేవ వరకు.. ఏ టైంలోనైనా గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. స్వామివారి అంతరాలయ ప్రవేశంతో పాటు వేదాశీర్వచనం చేసి షెల్తా, కనుము, ఐదు అభిషేకం లడ్డూలు, కేజీ పులిహోరాతో పాటు కొండపైకి వాహనాన్ని ఉచితంగా అనుమతిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్ రెడీ చేసి ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి పర్మిషన్ రాగానే ‘గరుడ టికెట్’ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
త్వరలో ‘యాదగిరి’ వీక్లీ, టీవీ ఛానల్
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్ సంస్థ తరఫున త్వరలోనే ‘యాదగిరి’ ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రికతో పాటు టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో ప్రకటించారు. స్వామి వారి ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలు, విశేష పూజలను ప్రత్యక్షంగా వీక్షించేలా చానల్ ఏర్పాటుతో పాటు విస్తృత ప్రచారం కల్పించేలా ఆధ్యాత్మిక మాసపత్రికను మొదలు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఆలయానికి సంబంధించిన విద్యుత్ బిల్లు కోసం ప్రతి ఏడాది రూ. రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తున్నందున గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రూ.20 కోట్లతో నాలుగు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, మరో నాలుగు మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే సత్యనారాయణస్వామి వ్రత టికెట్ ధరను రూ. 800 నుంచి రూ. 1000కి పెంచామని, ఈ ధర ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుందని చెప్పారు. యాదగిరికొండ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుపై ఐదు సర్కిళ్లకు దేవుళ్ల పేర్లతో నామకరణం చేస్తామని చెప్పారు. ఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాదరుషి విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విగ్రహాల ఏర్పాటుకు రూ.3.60 కోట్లు ఖర్చు కానుందని, దాతల సహకారంతో నిధులు సమకూర్చనున్నట్లు తెలిపారు.