సెస్​ మనుగడపై నీలినీడలు.. భారీగా అక్రమాలు

సెస్​ మనుగడపై నీలినీడలు..  భారీగా అక్రమాలు
  •    పాలకవర్గం, అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు 
  •     ఆడిట్​లో వెలుగుచూసిన అవకతవకలు
  •     పేరుకుపోయిన రూ.558.55 కోట్ల బకాయిలు
  •     ఎన్పీడీసీఎల్​లో విలీనం చేయాలని ఈఆర్సీ సిఫార్సు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ను ఎన్పీడీసీఎల్(నార్తర్న్​పవర్​ డిస్ట్రిబ్యూషన్​కంపెనీ లిమిటెడ్)లో  విలీనం చేయాలని ఈఆర్​సీ (తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి) సిఫార్సు చేయడంపై చర్చ మొదలైంది. సెస్​లో భారీగా అక్రమాలు జరుగుతున్నందున ఆ సంస్థను స్వతంత్రంగా కొనసాగించాల్సిన అవరసరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సెస్ పాలకవర్గం, సంస్థలో పని చేసే సిబ్బంది అవినీతి కారణంగా సెస్ తీవ్ర నష్టాల్లో కూరుపోయినట్లు స్పష్టం చేసింది. దీంతో సెస్​మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

గతమెంతో ఘనం.. ప్రస్తుతం అవినీతిమయం

1970 నవంబర్ 1న ప్రారంభమైన సెస్.. తెలంగాణలోని సహకార సంఘాల్లో విద్యుత్ రంగంలో సేవలందించే ఒకే ఒక సంస్థగా గుర్తింపు పొందింది. నాణ్యమైన విద్యుత్​సరఫరాతో లాభాల బాటలో పయనిస్తూ, వందల కోట్ల డిపాజిట్లతో ఆర్థికంగా బలంగా ఉండేది. కానీ రెండు దశాబ్దాలుగా సెస్ పై అవినీతి, అక్రమాల ఆరోపణలు తీవ్రమయ్యాయి. సెస్ పాలకమండలి, సిబ్బంది అక్రమాలపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల సంక్షేమ సంఘం ఫిర్యాదు మేరకు గతేడాది ఫిబ్రవరిలో సెస్ ఆవరణలో బహిరంగ విచారణ జరిగింది. 2014-–2022 మధ్య కాలంలో జరిగిన సెస్ కార్యకలాపాలపై ఈఆర్సీ ఆడిట్ నిర్వహించగా రూ.94.88 కోట్ల అవకతవకలు జరిగినట్లు బయటపడింది.

వినియోగదారుల కేటగిరీలు మార్చడం, కరెంట్ బిల్లుల వసూళ్లు చేయకపోవడం, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. సెస్.. ఎన్పీడీసీఎల్ నుంచి  కరెంట్ తీసుకొని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని13 మండలాలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. బకాయిల వసూళ్లను నిర్లక్ష్యం చేయడంతో సెస్ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. తద్వారా ఎన్పీడీసీఎల్ కు ఏకంగా రూ. 558.55 కోట్ల మేర బకాయి పడింది. బకాయిలపై చర్యలు తీసుకోవాలని గత నెల 10న సెస్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినా, ఎలాంటి  చర్యలు తీసుకోకపోవడాన్ని ఈఆర్సీ తప్పుపట్టింది.

అన్నీ అక్రమాలే.. 

సెస్ లో పాలకవర్గంతో పాటు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత పదేండ్లుగా సెస్ పరిధిలో ఆడిట్ జరగలేదు. తమ అక్రమాలు బయటపడ్తాయనే ఉద్దేశ్యంతోనే ఆడిట్​చేయించలేదని తెలుస్తోంది. పై స్థాయి అధికారులపై అవినీతి ఆరోపణలు రాగానే డిప్యూటేషన్లపై వెళ్లడం షరా మామూలుగా మారింది.  ఏళ్లుగా సెస్ లో పాతుకుపోయిన కింది స్థాయి ఉద్యోగులు అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నా కనీస చర్యలు కరువయ్యాయి. ముఖ్యంగా జిల్లాలోని రైస్ మిల్లులకు హై టెన్షన్ విద్యుత్ ను సరఫరా చేసినా దానిని తక్కువగా చూపించడం వల్ల సెస్ కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

సిరిసిల్లలో కేటగిరీ 4 కింద 10 పవర్​లూమ్స్​ఉంటే 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. చిన్న తరహా వస్త్రోత్పత్తిదారులకు ఇది వర్తిస్తుంది. కానీ వందల సాంచాలున్న బడా సేట్లకు కూడా కేటగిరీ 4 కింద విద్యుత్ సరఫరా చేసినట్లు ఆడిట్​లో గుర్తించారు. ఇక విద్యుత్​పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాల చిట్టా కూడా భారీగానే ఉంది. ఈ క్రమంలో సెస్​ను ప్రక్షాళించడం కంటే ఎన్పీడీసీఎల్​లో విలీనం చేయడమే మేలన్న నిర్ణయానికి సర్కారు సైతం వచ్చినట్లు చెప్తున్నారు.