సంపద పెంచుతున్న ఈసాప్స్​

సంపద పెంచుతున్న ఈసాప్స్​
  • ఐపీఓల సక్సెస్​తో ఇష్టపడుతున్న ఉద్యోగులు

వెలుగు బిజినెస్​ డెస్క్​: జొమాటో, పేటీఎం, డెలివరీ వంటి కంపెనీల ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​ (ఐపీఓ)లు సక్సెస్​ కావడంతోపాటు,  ఈసాప్స్​ కింద ఇచ్చిన షేర్లను నిలకడగా కంపెనీలే తిరిగి కొనుగోలు చేస్తుండటంతో ఉద్యోగులకు ఈసాప్స్​పై క్రేజ్​ పెరుగుతోంది. ఫ్లిప్​కార్ట్​ వంటి కంపెనీలలో ఉద్యోగులకు ఈసాప్స్​ కాసుల వర్షమే కురిపించాయి. కానీ, స్టార్టప్ కంపెనీలలో ఈసాప్స్​ తీసుకోవడానికి ఉద్యోగులకు తగినంత విశ్వాసం పబ్లిక్​ ఇష్యూల వల్లే పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2021 నుంచి ఉద్యోగుల నుంచి ఈసాప్స్​ షేర్లను కొనుగోలు చేయడానికి కంపెనీలు మొత్తం 1.46 బిలియన్​ డాలర్లను వెచ్చించాయని క్యాపిటా డేటా వెల్లడిస్తోంది.స్టార్టప్​లలో జాయినయ్యే ఉద్యోగులకు అత్యధికంగా బెనిఫిట్​ తెచ్చిపెట్టేవి ఈసాప్స్​మాత్రమే. ఇండస్ట్రీలోని ఇతర కంపెనీలకు సమానమైన జీతం ఎలాగూ దొరుకుతుంది. కానీ, స్టార్టప్​ సక్సెసయితే ఈసాప్స్​ కారణంగా లభించే సంపద అపారమైనదని యూనికార్న్​ కంపెనీ రేజర్​పే ఫౌండర్​, సీఈఓ హర్షిల్​ మాధుర్​ చెప్పారు. 

మా కంపెనీలో కొంత మంది ఉద్యోగుల జీవితాలైతే ఈసాప్స్​తో పూర్తిగా మారిపోవడాన్ని చూశానని పేర్కొన్నారు. పదేళ్ల కాలానికి చూసినా ఒక్క జీతం పెరుగుదలతో వారు ఇంత సంపద ఎప్పటికీ సంపాదించి ఉండలేకపోయేవారని హర్షిల్​ మాధుర్​ వెల్లడించారు. గత పదేళ్లలో రేజర్​పే నాలుగుసార్లు ఈసాప్​ షేర్లను బైబ్యాక్​ చేసింది. కిందటేడాది 75 మిలియన్​ డాలర్లతో ఉద్యోగుల నుంచి ఈసాప్​ షేర్లను ఈ కంపెనీ కొనుక్కుంది. ఫండింగ్​ కోసం ప్రయత్నించే ప్రతీసారీ కొత్త ఇన్వెస్టర్లకు ఉద్యోగుల చేతిలోని షేర్లను సెకండరీ సేల్​ కింద ఆఫర్​ చేస్తున్నామని రేజర్​పే సీఈఓ వివరించారు. 2021–22 లో టెక్​ స్టార్టప్​లకు పెట్టుబడులు వెల్లువెత్తినప్పటి నుంచీ ఉద్యోగులు కూడా తక్కువ జీతం, ఎక్కువ ఈసాప్స్​ కోసం చర్చలు జరపడం మొదలైంది.  ఇటీవల స్టార్టప్​లకు నిధులు దొరకడమే కష్టంగా మారింది. దీంతో ఇప్పుడు ఈసాప్స్​ మీద ఉద్యోగులు అంత మోజుపడటం లేదు. కానీ, స్టార్టప్స్​ దగ్గర తగినంతగా డబ్బులు ఆడని నేపథ్యంలో ఆ కంపెనీలు ఈసాప్స్​ఎక్కువగా ఇస్తున్నాయి. 

యూఎస్​, సింగపూర్​ల .. తరహా పన్ను విధానం ఉండాలి..

ఉద్యోగులకు ఈసాప్స్​ కింద ఇచ్చే షేర్లు ఒకేసారిగా రావు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఒప్పుకున్న దాని ప్రకారం ఏటా కొన్ని చొప్పున జారీ చేస్తారు. ఈసాప్స్​పై అమలవుతున్న పన్ను విధానాలు  మాత్రం  మన దేశంలో కొంత నిరుత్సాహం కలిగించేవేనని ఇండస్ట్రీ ఎనలిస్టులు చెబుతున్నారు. సింగపూర్​, యూఎస్​ వంటి దేశాల తరహా పద్ధతులు ఇండియాలోనూ వస్తే మేలని పేర్కొంటున్నారు.

ఉద్యోగులకు లిక్విడిటీ ఎప్పుడొస్తుంది....

స్టార్టప్​ కంపెనీ ఒక స్కేల్​కి ఎదిగి, ఫండింగ్​ను తెచ్చుకోగలిగినప్పుడే ఈసాప్ షేర్లకు లిక్విడిటీ దొరుకుతుంది. ఫండింగ్​ బూమ్​ టైములో ఏ, బీ సిరీస్​ రౌండ్ల ఫండింగ్​మాత్రమే పూర్తి చేసుకున్న స్టార్టప్​ కంపెనీలు సైతం ఒకటి, రెండేళ్లలోనే ఈసాప్​క్యాష్​ అవుట్స్​ను ఆఫర్​ చేయడం విశేషం. సిరీస్​ ఏ కింద 3 మిలియన్​ డాలర్ల ఫండింగ్​ తెచ్చుకున్న ఫిన్​టెక్​ కంపెనీ గ్రిప్​ఇన్వెస్ట్​2022 మొదట్లోనే బైబ్యాక్​ ప్రోగ్రామ్​ ప్రకటించింది. ఇలాంటి అవకాశాలు మళ్లీ ఇప్పట్లో రాకపోవచ్చని ఒక వెంచర్​ క్యాపిటల్​ సంస్థ మేనేజింగ్​ పార్ట్​నర్​ చెప్పారు. 

కనీసం రెండు, మూడేళ్ల వాల్యూ క్రియేషన్​ తర్వాత మాత్రం ఈసాప్స్​ బైబ్యాక్​ అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. కాకపోతే, పైన చెప్పిన ఉదాహరణ వల్ల చిన్న కంపెనీలలో సైతం ఈసాప్స్​ తీసుకోవడానికి ఉద్యోగులు ఇష్టపడుతున్నారు. యూనికార్న్​గా మారిన ఫోన్​పేను విడదీసినప్పుడు ఫ్లిప్​కార్ట్​ తన ఉద్యోగుల కోసం 700 మిలియన్​ డాలర్లతో ఈసాప్​ బైబ్యాక్​ ప్రోగ్రామ్​ ప్రకటించింది. ఫోన్​పే విలువను నగదు రూపంలో ఫ్లిప్​కార్ట్​ ఉద్యోగులకు చెల్లించారు.