
- పొలాసలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ
- ఇప్పటికే నివేదికలు పంపిన సైంటిస్టులు
- ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు
- రీసెర్చ్ వింగ్ ఏర్పాటైతే సాగుకు మరింత ప్రోత్సాహం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఆవాల రీసెర్చ్ వింగ్ ఏర్పాటు కలగానే మిగిలింది. మూడేండ్ల కింద పొలాసలోని జయశంకర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో ఆవాల రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మూడేండ్ల కింద హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి సైంటిస్ట్‌లు జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌కు నివేదికలు కూడా పంపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వింగ్ఏర్పాటు హామీగానే మిగిలింది.
వేలాది ఎకరాల్లో సాగు
ఉమ్మడి జిల్లాలో ఆవాల సాగుకు ప్రోత్సహానికి రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని రైతుల నుంచి కొన్నేండ్లుగా డిమాండ్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో ఆవాలు సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అనుకూల వాతావరణం, సారవంతమైన నేలలు ఉండడంతో సాగు పెరుగుతోంది. ఆవాలు ఎకరానికి 6 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా.. సుమారు రూ. 40 వేలకు పైగా ఆదాయం వస్తుంది. దీంతోపాటు 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుండడంతో రైతులు ఆవాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఆవాల పంట ద్వారా తేనెటీగలు ఎక్కువగా ఉత్పత్తయ్యే అవకాశం ఉండగా, తేనేటీగల పెంపకాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు.
తేనేటీగలు పెరిగితే మామిడి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆవాల పంట సాగు అంశాలపై సైంటిస్టులు జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌కు నివేదిక పంపించారు. అనంతరం అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అయితే కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ప్రతిపాదనలకే పరిమితమైంది.