నేడు ఈటల రాజీనామా

నేడు  ఈటల రాజీనామా

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌  శుక్రవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. టీఆర్​ఎస్ పార్టీకి కూడా గుడ్​ బై చెప్పనున్నారు. ఈ నెల 8 లేదా 9న బీజేపీలో చేరుతారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈటల తన నిర్ణయాన్ని శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశాలున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం గురువారం ఉదయమే హైదరాబాద్​కు వచ్చిన ఆయనకు అనుచరులు, నియోజకవర్గ నేతలు  ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఏం హామీ ఇచ్చింది..? సొంత పార్టీ పెడుతారని ప్రచారం జరిగినందున ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు..? తన భవిష్యత్‌‌ కార్యాచరణ ఏమిటి..? అనేది శుక్రవారం ఉదయం ఈటల వెల్లడించే అవకాశాలున్నాయి. 

ఆయన ముందుగా ఎమ్మెల్యే పదవికి, టీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత సొంత నియోజకర్గానికి వెళ్లి తన అనుచరులతో మరోసారి మంతనాలు జరుపనున్నారు. అనంతరం మంచిరోజు చూసుకొని బీజేపీలో చేరుతారని సన్నిహితులు చెప్తున్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరుతారని అంటున్నారు. ఈటలతో పాటు మరికొందరు ఉద్యమ నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. అసైన్డ్ భూములు ఆక్రమించారన్న ఆరోపణలపై సీఎం కేసీఆర్​ ఈటలను రాత్రికి రాత్రి  కేబినెట్​ నుంచి తొలిగించి, ఈటల ఆస్తులు, భూములపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదంతా రాజకీయ కుట్రేనని, అవసరమైతే సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల సవాల్​ కూడా విసిరారు. అయితే.. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొద్ది రోజులుగా ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం హుజురాబాద్​లోని నేతలు, సహచరులతో చర్చలు జరిపిన ఈటల.. ఇతర పార్టీల నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా బీజేపీ జాతీయ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర నేతలతో  సంప్రదింపులు జరిపారు. ఐదు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా,  పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్​.సంతోష్​,  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​ తరుణ్‌‌‌‌‌‌‌‌ చుగ్‌‌‌‌‌‌‌‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి  సంజయ్, కోర్​ కమిటీ మెంబర్​ వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి  ఢిల్లీ టూర్ లో ఈటల వెంట ఉన్నారు. ఈటల తన భవిష్యత్​ కార్యాచరణను శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.