నా గెలుపు హుజురాబాద్ ప్రజలకు అంకితం

నా గెలుపు హుజురాబాద్ ప్రజలకు అంకితం

హుజురాబాద్ గెలుపును  హుజురాబాద్ ప్రజలకు అంకితం చేస్తున్నానని అన్నారు ఈటల రాజేందర్. గెలుపు తర్వాత కౌంటింగ్ కేంద్రం దగ్గర వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు బొందపెట్టారని అన్నారు. నా తోలుతో చెప్పులు కుట్టించినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనంటూ తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారులు నిజాయితీగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ప్రతీ ఒక్కరినీ వేధించారని..అయినా కష్టాలు ఓర్చుకుని తన గెలుపు కోసం  పని చేశారని చెప్పారు. స్వేచ్ఛగా మాట్లాడలేని..తిరగలేని పరిస్థితి ఏర్పడిందని.. అలాంటివి పునరావృతం కావద్దని కోరుకుంటున్నానన్నారు.

నా గెలుపు కోసం వివేక్ వెంకట స్వామి, బండి సంజయ్,  జితేందర్ రెడ్డి, విజయశాంతితో పాటు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక రకాలు గా తోడ్పాటునందిచారన్నారు. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా ప్రజలకు అందు బాటులో ఉంటానని తెలిపారు. అంతేకాదు...దళిత బంధును హుజురాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు. దీంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడంతో పాటు..ఉద్యోగాల నోటిఫికేషన్..నిరుద్యోగ భృతి..57 ఏళ్లు నిండిన వారందరికీ ఫెన్షన్..రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు ఈటల.