
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ జరిగి ఆరేళ్లు పూర్తయినప్పటకీ వ్యవస్థలో క్యాష్ సర్క్యులేషన్ ఇంకా ఎక్కువగానే ఉంది. చెప్పాలంటే డీమానిటైజేషన్ ముందు కంటే 71.84 శాతం ఎక్కువ క్యాష్ ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 21 నాటికి ప్రజల దగ్గర రూ.30.88 లక్షల కోట్లు క్యాష్ రూపంలో ఉన్నాయి. నవంబర్ 4, 2016 నాటికి వ్యవస్థలో రూ.17.7 లక్షల కోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. నవంబర్ 8, 2016 న రూ.500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. వ్యవస్థలోని బ్లాక్ మనీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పుడు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఎటువంటి ప్లానింగ్ లేకుండా డీమానిటైజేషన్ జరిగిందని, అమలు చేయడం కూడా బాగాలేదని చాలా మంది ఎక్స్‌పర్టులు ప్రభుత్వాన్ని విమర్శించారు. గవర్న్‌మెంట్ మాత్రం డీమానిటైజేషన్ వలన వ్యవస్థలో క్యాష్ సర్క్యూలేషన్ తగ్గుతుందని గతంలో చెప్పుకొచ్చింది. కాగా, ప్రజలు ట్రాన్సాక్షన్లు, ట్రేడ్స్ చేయడానికి, గూడ్స్, సర్వీస్‌లను కొనుగోలు చేయడానికి వాడే కాయిన్లు, నోట్లను కరెన్సీగా పిలుస్తున్నారు. బ్యాంకుల దగ్గర ఉన్న క్యాష్‌ను మినహాయించి వ్యవస్థలో క్యాష్ సర్క్యులేషన్స్‌ను లెక్కిస్తారు.
క్యాష్‌కే మొగ్గు..
కరోనా సంక్షోభం తర్వాత డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ ఎకానమీలో క్యాష్ వాడకం తగ్గడం లేదు. ‘వాల్యూ, వాల్యూమ్స్ పరంగా డిజిటల్ పేమెంట్స్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఎకానమీ గ్రోత్‌తో పాటే క్యాష్–జీడీపీ- సర్క్యూలేషన్ రేషియో కూడా నిలకడగా పెరుగుతోంది’ అని 2019 లో విడుదల చేసిన డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. డీజిటల్ పేమెంట్స్ పెరుగుతున్నప్పటికీ క్యాష్ వాడకం తగ్గడం లేదని ఈ రిపోర్ట్ వెల్లడించింది. డీమానిటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయని తెలిపింది. తాజా దీపావళి వారంలో కరెన్సీ సర్యూలేషన్ రూ.7,600 కోట్లు తగ్గిందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తాజాగా ఓ రీసెర్చ్ నోట్‌లో పేర్కొన్నారు. 2009 తర్వాత నుంచి చూస్తే దీపావళి పండగ టైమ్‌లో కరెన్సీ సర్క్యూలేషన్స్ తగ్గడం ఇదే మొదటిసారని చెప్పారు.