ఉనికి కోసం ఉబలాటం : దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్ పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్​ సంస్థ

ఉనికి కోసం ఉబలాటం : దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్ పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్​ సంస్థ

బౌద్ధ జాతక కథల్లో ఒక ఆసక్తికరమైన వృత్తాంతం ఉంది. ‘పాపానికి ప్రాయశ్చిత్తం లేదా?’ అని అడుగుతాడొక శిష్యపరమాణువు బోధిసత్వుణ్ని.‘‘ లేకేం... ఉంది. తెలిసో తెలియకో పాపం జరిగితే, ‘అయ్యో ఇంత ఘోరం జరిగిపోయిందే, నేనీ పాపం చేసి ఉండాల్సింది కాదు, ఇక ఎప్పుడూ చేయకూడదు, చేయను’ అని పశ్చాత్తాపపడటమే పాపానికి ప్రాయశ్చిత్తం’’ అని సెలవిస్తాడు. ‘కానీ, పాపానికి పాపానికి మధ్య ఒక పశ్చాత్తాపం, అలాగే పశ్చాత్తాపానికీ పశ్చాత్తాపానికీ మధ్య ఒక పాపం.. ఇదొక నిరంతర చక్రియ ప్రక్రియ అయితే, ఇక దానికి నిష్కృతి లేదు’ అని కూడా వివరిస్తాడు. ఇప్పుడు తెలంగాణలో కమ్యూనిస్టుల పరిస్థితి అచ్చం అలాగే ఉంది. తప్పులు చేయడం, చెంపలేసుకోవడం, మళ్లీ తప్పులు చేయడం వారికి రివాజుగా మారింది. దాని ఫలితం, సంస్థాగతంగా కమ్యూనిస్టుల పరిస్థితి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.

ఎప్పుడూ అధికారంలోకి రాకపోయినా ప్రభుత్వాలను నియంత్రించే, దారిలో నడుపగలిగే ‘ప్రెషర్‌‌ గ్రూప్‌‌’ స్థితిలో కమ్యూనిస్టులు ఉండే వారు. చట్టసభల్లోనూ తగిన సంఖ్య ప్రతినిధులతో చర్చలను, సమీక్షలను, బిల్లులు – ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థానం వారికుండేది. ఇంకో వైపు ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు... వెరసి, జనహితంలో పనిచేస్తారనే కీర్తి వారికి దక్కేది. కానీ, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో వారొక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తరాల మధ్య అంతరం కూడా వారిలో సిద్ధాంత బలహీనతకు కారణమవుతున్నది. 

పొత్తులతో పొద్దు పొడిచేనా?

నిబద్ధతతో కూడిన నిరవధిక ఉద్యమాలు లేక, ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయి, రాజకీయంగా పట్టు దొరక్క, ఉనికి కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఆ తండ్లాటలో పెద్ద పార్టీలకు తోకలుగా పొత్తులకు వెళ్లి, అక్కడా బోల్తాపడి, జనక్షేత్రంలో మరింత భంగపోతున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుత శాసనసభలో అసలు ప్రాతినిధ్యం కూడా లేదు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఒకటో, రెండో సీట్లు గెలవటం..... తర్వాత, అదే తప్పయిందని, బూర్జువా పార్టీలతో పొత్తుల వల్లే జనానికి దూరమవుతున్నామని సమీక్షించుకోవడం, ఎన్నికల వేళ మళ్లీ అదే తప్పులు చేయడం వారికి మామూలైపోయింది. నిన్నటి దాకా ‘లాల్‌‌, నీల్‌‌’ నినాదమిచ్చి, ఇవ్వాల ‘ఎర్రగులాబీ’ రూపమెత్తడం అందుకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడ్డ నుంచి, గడిచిన ఎనిమిదేండ్లుగా పాలకపక్షమైన టీఆర్‌‌ఎస్‌‌కు దూరం ఉండి, విమర్శించి, రేపటి సాధారణ ఎన్నికల్లో పొత్తులతో కలిసి సాగాలని కమ్యూనిస్టు పార్టీ(లు) ఇప్పుడు స్థూలంగా నిర్ణయించాయి.

పాలకపక్ష అభ్యర్థి పదివేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డ మునుగోడు ఉప ఎన్నిక గెలుపులో పొత్తే కీలకపాత్ర వహించిందని ఇరు పక్షాలూ బలంగా నమ్ముతున్నాయి. పొత్తు ఈ ఉపఎన్నిక వరకే పరిమితమని కమ్యూనిస్టులు ముందు ప్రకటించినప్పటికీ, పాలక టీఆర్‌‌ఎస్‌‌ భావిస్తున్నట్టే ఈ బంధాన్ని రానున్న సాధారణ ఎన్నికల్లోనూ కొనసాగించడం వైపే ఇప్పుడు కమ్యూనిస్టులూ మొగ్గుతున్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఎంతో కొంత ఉనికి, పట్టు ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ పొత్తుల పొద్దు పొడిచే సూచనలు విస్పష్టం. 

మురవాలో, వగవాలో తెలియక..

‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింద’న్నట్టే ఉంది ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పలువురు టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి! అందులో అత్యధికులు కారు గుర్తుతో గెలిచిన వారు కాగా మరి కొందరు ఇతర పార్టీల నుంచో, స్వతంత్రులుగానో గెలిచి కారెక్కిన వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కాకపోయినా, ఆ జిల్లాల్లో అక్కడక్కడ పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న కొందరు ఆశావహ అభ్యుర్థుల పరిస్థితీ ఇలాగే ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలుపు సంతోషం కలిగించేదే అయినా, అది కమ్యూనిస్టులతో సహకారం వల్ల వచ్చిందన్నదే వారికి మింగుడుపడని చేదు మాత్రగా ఉంది. మునుగోడు ఊపుతో ఏడాదిలో రానున్న సాధారణ ఎన్నికల్లోనూ ‘కమ్యూనిస్టులతో కలిసే సాగుతాం’ అన్న పార్టీ అధినేత కేసీఆర్‌‌ నిర్ణయం తమ టిక్కెట్లకు ఎసరు తెచ్చేలా ఉందనేది వారి బాధ. పొత్తులన్నాక కొన్ని ఎత్తులు, అందులో భాగంగా కొన్ని త్యాగాలు, ఈ త్యాగాల పరంపరలో కొందరు పోటీ చేసే చాన్స్‌‌ పోగొట్టుకోవడం.... ఇలాంటివన్నీ మామూలే! కమ్యూనిస్టులు ఆశించే స్థానాల్లోని టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు, టిక్కెట్టు ఆశావహులు తీవ్రంగా నలతకు గురవుతున్నారు.  ‘ఆ రెండు జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట సీట్లు అడగటంలో తప్పులేదని, ఆ ప్రతిపాదన తమకు అంగీకారమే’ అని కేసీఆర్‌‌ ఇప్పటికే సంకేతమిచ్చారు. ఆయనే, మరో సందర్భంలో తమ పార్టీలోని సిట్టింగులందరికీ టిక్కెట్లు ఖాయం అన్నట్టు మాట్లాడారు. ఇందులో ఏది సత్యం? అన్నది ప్రశ్న. ఇక సీపీఎం అధినేత తమ్మినేని వీరభద్రం, పాలేరు నియోజకవర్గ భేటీలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, ‘వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎర్రజెండా ఎగరటం ఖాయం’ అంటూ చేసిన వ్యాఖ్య టీఆర్ఎస్​వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నది. కాంగ్రెస్‌‌లో గెలిచి టీఆర్‌‌ఎస్‌‌ గూడు చేరిన సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే ఉపేందర్‌‌ రెడ్డి తిరిగి తానే అభ్యర్థిని అనుకుంటున్నారు. మరోవైపు, ఈసారి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుయాయులకు చెప్పి, ఆ మేర సన్నాహాల్లో ఉన్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కలిపి, ఇటువంటి స్పర్ధ సుమారు16 నియోజకవర్గాల్లో వస్తుంది. ప్రతిపాదనల్లో ఇంకా ఎక్కువ స్థానాలే అడిగినా ఖమ్మం, వైర, మధిర, భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్‌‌, ఇబ్రహీంపట్నం స్థానాల కోసం సీపీఎం పట్టుబట్టవచ్చు. అదే రీతిలో, ఖమ్మం, కొత్తగూడెం, దేవరకొండ, మునుగోడు, కల్వకుర్తి, చేవెళ్ల, హుస్నాబాద్‌‌ వంటి స్థానాలను సీపీఐ అడిగే ఆస్కారం ఉంటుంది. చూడాలి ఇచ్చిపుచ్చుకునే సయోధ్యలో ఎవరికేం దక్కుతుందో?

ఫలించని ప్రయోగాలు..

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, తర్వాత కొద్ది కాలంపాటు తెలుగునాట గొప్ప చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు, కాలక్రమంలో ఒట్టి చరిత్రగానే మిగులుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎక్కువ చెరో దారిలోనే సాగాయి. విడిపోయాక ఆయా కమ్యూనిస్టు పార్టీలు తమ రాజకీయ మనుగడ, అవసరాల కోసం కావచ్చు, సమకాలీన పరిస్థితులు వల్ల అవొచ్చు కలిసి పనిచేసింది తక్కువే! ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల, స్థానిక సంస్థలు వంటి ఎన్నికల్లో పోటీ వారిద్దరి మధ్యే అంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. గతంలో ఎన్టీఆర్​వారిద్దరిని కలిపితే, 2009లో చంద్రబాబు నేతృత్వంలోని ‘మహా కూటమి’ విఫలయత్నంలోనూ వారు భాగస్వాములు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ వారిని వెంటతీసుకుపోదామని చూస్తున్నారు. మునుగోడులో దొరికిన రుచి అందుకు కారణం. రాష్ట్ర విభజన తర్వాత 2014లో, 2018 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు వేర్వేరు పొత్తులతో, ప్రజాసంఘాల కూడికతో చేసిన అన్ని ప్రయోగాలూ విఫలమయ్యాయి. 2014లో సీపీఎం వైఎస్సార్‌‌సీపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది. సీపీఐ కాంగ్రెస్‌‌తో కలిసి వెళ్లింది. అదే పంథా సీపీఐ 2018 ముందస్తు ఎన్నికల్లో కొనసాగిస్తే, సీపీఐఎం మాత్రం బహుజన లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌ (బీఎల్‌‌ఎఫ్‌‌) ఏర్పాటు చేసి, పెద్ద ఆశలతో బరిలో దిగింది. కానీ, ఉభయ కమ్యూనిస్టుల ఆశలు తీరం చేరక, అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశమే రాలేదు. 2014 ఎన్నికల్లో కనీసం సీపీఐ, సీపీఎంలకు ఒక్కో సీటైనా దక్కాయి. 2018లో బీఎల్‌‌ఎఫ్‌‌ 107 స్థానాల్లో పోటీ చేసి, పోలైన ఓట్లలో 1.1 శాతం పొందింది. మొత్తంలో 26 చోట్ల పోటీ చేసిన సీపీఎం 0.4శాతం ఓట్లను మాత్రమే దక్కించుకుంది.

యువత ఎలా స్పందిస్తుందో!

బీజేపీని ఎదుర్కోవడం అన్న ఏకైక కారణంతో రాష్ట్రంలో పాలకపక్షమైన టీఆర్​ఎస్​తో కలిసి వెళ్లటం కమ్యూనిస్టుల్లోని యువతకు అంతగా మింగుడు పడట్లేదనే అభిప్రాయం ఒకటుంది. మొన్న మునుగోడులో కూడా స్థిరమైన కమ్యూనిస్టు శ్రేణులు, సానుభూతిపరుల్లో 30 నుంచి 40 శాతం ఓటు టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి వైపు రాలేదని, అందుకు యువత విభిన్నంగా ఉండటమే కారణమన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఇది తరాల మధ్య అంతరం. రేపు, సమయం సందర్భం చూసుకొని కేసీఆర్‌‌ బీజేపీ వైపు మొగ్గరనే గ్యారెంటీ ఏముందనే ప్రశ్న వారు లేవనెత్తుతున్నారు. లోగడ ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చిన సందర్భాలను వారు ఉటంకిస్తున్నారు. కమ్యూనిస్టుల పంథా నిజంగా బీజేపీని అడ్డుకునేందుకే అయితే, ఆ విషయంలో గట్టి చరిత్ర ఉన్న కాంగ్రెస్‌‌తో చేతులు కలపాలి తప్ప టీఆర్‌‌ఎస్‌‌తో ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. లోతైన ప్రతి సమీక్షలో గ్రహిస్తున్నట్టు పెద్ద పార్టీలకు తోకలుగా కాకుండా ప్రజాక్షేత్రం నుంచి బలపడితే తప్ప కమ్యూనిస్టుల మనుగడ, పూర్వవైభవం.... ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే!

- దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్ పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్​ సంస్థ