రూ.16 కోట్లు ఖర్చు చేసినా.. చెత్త గుట్ట తగ్గలే !

 రూ.16 కోట్లు ఖర్చు చేసినా.. చెత్త గుట్ట తగ్గలే !
  • కరీంనగర్​ డంపింగ్ ​యార్డులో నిలిచిన బయోమైనింగ్
  • ఎక్కడి చెత్తను అక్కడే వదిలి వెళ్లిన కాంట్రాక్ట్ సంస్థ
  • డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి
  • రోజూ 40 లారీల వేస్టేజ్ రాక..
  • యార్డును తరలించాలని వేడుకుంటున్న స్థానికులు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీలో కమాన్ నుంచి మానేరు మధ్య ఉన్న కాలనీల జనాన్ని డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోంది. రోజూ సాయంత్రం డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బయోమైనింగ్ పేరిట రూ.16 కోట్లు ఖర్చు చేసినా చెత్త నిల్వలు ఏ మాత్రం తగ్గలేదు. అగ్రిమెంట్ ప్రకారం చెత్తను పూర్తిగా రీ సైకిల్​ చేసి.. ఖాళీ స్థలాన్ని కార్పొరేషన్​కు అప్పగించాల్సిన కాంట్రాక్ట్ సంస్థ ఆరు నెలల క్రితమే ఎక్కడి చెత్తను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. మరోవైపు నెల రోజులుగా చెత్తకు అంటుకున్న మంటలపై ఎన్ని నీళ్లు చల్లినా చల్లారడం లేదు. దీంతో పొగతో హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటో నగర్, కోతిరాంపూర్, రామగుండం బైపాస్ రోడ్డు ఏరియా, బొమ్మకల్ శివారు, కరీంనగర్  హన్మకొండ రోడ్డు ఏరియాలను పొగ కమ్మేస్తోంది. దీంతో సిటీ జనం, ఆ ఏరియాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

నిలిచిపోయిన బయోమైనింగ్..

డంపింగ్ యార్డులో 50 ఏండ్లుగా పేరుకుపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్‌‌ టన్నుల చెత్తను తగ్గించడంతోపాటు ఆ స్థలాన్ని మళ్లీ వినియోగించుకునేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్  మున్సిపల్ కార్పొరేషన్ బయోమైనింగ్ మొదలుపెట్టింది. ఇందుకోసం స్మార్ట్ సిటీ నిధుల నుంచి రూ.16 కోట్లు కేటాయించింది. టెండర్లు దక్కించుకున్న చెన్నైకి చెందిన సంస్థ పోయిన ఏడాది జూన్ 7న చెత్తను ప్రాసెస్ చేయడం మొదలుపెట్టింది. అగ్రిమెంట్ ప్రకారం ఏడాదిలో డంపింగ్ యార్డును పూర్తిగా క్లీన్ చేసి, తొమ్మిది ఎకరాల స్థలాన్ని కార్పొరేషన్​కు అప్పగించాల్సి ఉంది. కానీ, ఏడాదిపాటు మూడు షిఫ్టులుగా వర్కర్స్ తో పని చేయించినా టార్గెట్ ను రీచ్ కాలేక చేతులెత్తేసింది. ఆరు నెలలుగా బయోమైనింగ్ నిలిచిపోయింది.

పొగతో స్థానికులకు అనారోగ్య సమస్యలు

డంపింగ్ యార్డుకు ఒకసారి మంటలు అంటుకుంటే ఎన్ని నీళ్లు కొట్టినా చల్లారడం లేదు. అయితే, మంటలు అంటుకుంటున్నాయా..లేక మున్సిపల్ సిబ్బందే అంటిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి మంటలు కనిపించకపోయినా లోపల మంటలంటుకుని పొగలు వస్తూనే ఉన్నాయి. చెత్త కాలిన వాసన, పొగ మానేరు నదీ తీరంలో రెండు, మూడు కిలోమీటర్ల వరకూ వస్తోంది. డంప్ యార్డు పెద్దపల్లి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పొగతో అటు వైపుగా వెళ్లే వాహనదారులకు రోడ్డు కూడా సరిగ్గా కనిపించడం లేదు. సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సందర్శనకు వచ్చేవారికీ తిప్పలు తప్పట్లేదు. పొగతో జనాలకు ఊపిరాడకపోవడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో తలనొప్పి, వికారం, కండ్ల మంటలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు దగ్గు, జలుబు, ఆస్తమాలాంటి రోగాల బారినపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును వీలైనంత త్వరగా తరలించాలని కోరుతున్నారు.

రోజూ యార్డులోకి 184 టన్నుల చెత్త..

50 ఏండ్లుగా బైపాస్ రోడ్డులోని మానేరు ఒడ్డున ఉన్న తొమ్మిది ఎకరాల స్థలంలో చెత్తను డంప్ చేస్తున్నారు. కరీంనగర్ సిటీలోని 60 డివిజన్లలోని సుమారు 78 వేల ఇండ్ల నుంచి ప్రతి రోజు దాదాపు 184 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. సుమారు నాలుగు లక్షలపై చిలుకు జనాభా ఉన్న కరీంనగర్ సిటీలో ఇండ్ల నుంచే కాక, దుకాణాలు, హోటళ్లు, చికెన్ సెంటర్ల నుంచి వచ్చే చెత్తను మానేరు తీరంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రోజూ సుమారు 20 నుంచి 30 లారీల చెత్త వస్తుందని అంచనా. ఏండ్లుగా పేరుకుపోయిన చెత్త... ఇప్పుడు గుట్టలా మారిపోయింది. డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి తరలించేందుకు ఇప్పటి వరకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేదు.