
- ఐఆర్బీకి బాధ్యతలు అప్పగించాక నిర్వహణ లోపం
- మెయింటెనెన్స్ లోపంతో వాహనదారుల ఇబ్బందులు
- చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవట్లే
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. మొన్నటి వరకు పూర్తిగా రోడ్లు ధ్వంసం కాగా.. ఇప్పుడు ఓఆర్‌ఆర్ పైన లైట్లు కూడా వెలగడం లేదు. కొన్ని కిలోమీటర్ల మేర సమస్య ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నిర్వహణ లోపంతోనే లైట్లు వెలగడం లేదు. ఐఆర్బీ సంస్థకు బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి నిర్వహణ సరిగా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓఆర్ఆర్ మొత్తం158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, పదుల కిలోమీటర్లలో డైలీ లైట్లు వెలగడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓఆర్ఆర్ పై వంద స్పీడ్ నుంచి 120 స్పీడ్‌కి పెంచుతూ కొద్దిరోజుల కిందట గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ లైటింగ్, రోడ్డు కరాబు ఉండటంతో కొన్ని చోట్ల 80 స్పీడ్ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సంస్థ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అధికారులు వారిపై ఒత్తిడి తీసుకురాకపోవడంతోనే చేయడం లేదని తెలుస్తుంది. ఈ సంస్థపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నికల సమయంతో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అందుకు అనుగుణంగానే ఓఆర్ఆర్ లీజుపై విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఓ మంత్రి ఇటీవల ప్రకటించారు.
టీఓటీ పద్ధతిలో అప్పగించినా..
ఈ ఏడాది జులై నెల వరకు ఓఆర్ఆర్ ని హెచ్ఎండీఏ స్వయంగా పర్యవేక్షించేది. టోల్ వసూల్ మాత్రం ఈగల్ ఇన్ ఫ్రా సంస్థ కలెక్ట్ చేసి హెచ్ఎండీఎకి ఇచ్చేది. ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(టీఓటీ) పద్ధతిలో లీజుకిచ్చినది తెలిసిందే. ఐఆర్బీ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 30 ఏళ్ల పాటు రూ.7,380 కోట్లకు టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ (టీఓటీ)పద్ధతిలో గత ప్రభుత్వం లీజుకిచ్చింది.
ఓఆర్ఆర్‌తో పాటు సర్వీసు రోడ్డు నిర్వహణ బాధ్యత ఈ సంస్థ పైనే ఉంటుంది. కానీ దీన్ని సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో టోల్ చెల్లిస్తున్న వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓఆర్ఆర్‌పై సోషల్ మీడియాలో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం లైటింగ్ కూడా ఉండటం లేదని ఫైర్ అవుతున్నారు. కొందరు ఏకంగా ఓఆర్‌ఆర్‌పై ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు సీఎం ఆఫీసు, హెచ్ఎండీఏ అధికారులకు ట్వీట్ చేస్తున్నారు.
సర్వీసు రోడ్డుపై లైట్లు వెలగవు, బోర్డులుండవు
ఔటర్ రింగ్‌రోడ్డు ( ఓఆర్ఆర్) సర్వీసు రోడ్డులో సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా పోయింది. 14 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పుడు వందల సంఖ్యలో వాహనాలు మాత్రమే తిరిగిన సర్వీసు రోడ్లపై ఇప్పుడు వేలల్లో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు కంటిన్యూటీ లేని ప్రాంతాల్లో సరైన సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం లేదు.
దీంతో సర్వీసు రోడ్డు డెడ్ ఎండ్ వరకు వాహనదారులు వెళ్లి వెనక్కి వెళ్తున్నారు. ఇలా అన్నిచోట్ల పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో చివరి వరకు వచ్చి రోడ్డు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. రాత్రి వేళల్లో సర్వీసు రోడ్లపై లైట్లు వెలగకపోతుండటం సమస్యగా మారింది. కంటిన్యూటీ లేని దగ్గర సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఉండవని వాహనదారులకు అంటున్నారు.