కొన్న వడ్లకు పైసలిస్తలే

కొన్న వడ్లకు పైసలిస్తలే

కొన్న వడ్లకు పైసలిస్తలే

దగ్గర పడ్తున్న వానాకాలం సీజన్.. అరిగోస పడ్తున్న అన్నదాతలు

లాగోడికి ఎక్కడి నుంచి తేవాలని ఆవేదన

మాటలకే పరిమితమైన నష్టపరిహారం

నెల రోజులుగా పెండింగ్​లో  పెట్టిన ప్రభుత్వం

రైతులకు 6,100 కోట్లు బాకీ

ఇంకా పలు చోట్ల ముందుకు సాగని కొనుగోళ్లు

హైదరాబాద్, వెలుగు : పునాస సీజన్​ దగ్గరపడుతున్నా యాసంగి వడ్ల పైసలు రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. దుక్కులు దున్నుకొని, వడ్లు అలుక్కోవాలంటే పైసలు ఎక్కడి నుంచి తేవాలని అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. వడ్లు కొన్న రెండు మూడు రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. రాష్ట్రంలోని చాలా చోట్ల నెల రోజులుగా జమ కావడం లేదు. ఇదే విషయమై కొనుగోలు సెంటర్ల దగ్గరకు వెళ్తే.. కొనుడు వరకే తమ బాధ్యత అని, పేమెంట్స్​ను సర్కారే చూసుకుంటుందని అక్కడి వారు చెప్తున్నారు. దీంతో రైతులు ఎప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు పడుతాయా అని ఎదురుచూడాల్సి వస్తున్నది.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ.10,200 కోట్ల విలువైన వడ్లను ప్రభుత్వం సేకరించింది. ఇందులో సగానికి పైగా అంటే దాదాపు రూ. 6,100 కోట్లు రైతులకు పెండింగ్​లో పెట్టింది. సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ దగ్గర నిధులు లేకపోవడంతోనే  రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం లేదని తెలిసింది. మరోవైపు పలు ప్రాంతాల్లో వడ్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. కల్లాల్లో, రోడ్ల మీద వడ్లు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. వానల నుంచి వాటిని కాపాడుకునేందుకు రైతులు అరిగోసపడుతున్నారు. ఇప్పటికే చెడగొట్టు వానలు, వడగండ్లు రైతులను నట్టేటా ముంచాయి. నష్ట పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు. 

నిధుల సర్దుబాటు లేక..

వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి సరైన ప్రణాళికతో వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. యాక్షన్​ ప్లాన్​పై రాష్ట్రస్థాయిలో మీటింగ్​లు పెట్టినట్లు హడావుడి చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేయడం లేదు. ఏప్రిల్​ 15 నుంచి యాసంగి వడ్ల కొనుగోళ్లు ప్రారంభించినా.. చాలా చోట్ల పది పదిహేను రోజుల వరకు సెంటర్లు కూడా ఓపెన్​ కాలేదు. ఓపెన్​ అయిన చోట వెంటది వెంట కాంటాలు వేయలేదు. దీంతో రైతులు తిప్పలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు. ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో వడ్ల సొమ్మును జమ చేసేందుకు నిధులను కూడా ప్రభుత్వం సర్దుబాటు చేసుకోలేదు.  కొనుగోళ్లకు దాదాపు రూ. 18 వేల కోట్లు అందుబాటులో పెట్టుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినా.. అందులో కనీసం రూ.5 వేల కోట్లు కూడా రెడీగా పెట్టుకోలేదు. దీంతో మొదట్లో వడ్లు కొన్న రైతులకు 10 ,15 రోజులకు డబ్బులు జమ అయ్యాయి. నెల రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో చెల్లింపులు ఆగిపోయాయి. బ్యాంకుల​ నుంచి గ్యారంటీ కింద పదివేల కోట్ల రూపాయలు తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించినా ఇంతవరకు బ్యాంకుల నుంచి అప్రూవల్​ రాలేదని తెలిసింది. 

48 గంటల్లోనే జమ చేయాలి

వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్ర సర్కార్​ మొత్తం 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి దాకా 50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు చెప్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తి కాగానే మిల్లులకు తరలించిన తర్వాత ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్​లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రీ చేస్తారు. వడ్లను మిల్లర్లు దించుకొని ఓకే చెప్పిన తర్వాత ట్రక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోఉన్న తూకం ఆధారంగా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు, మిల్లర్లు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో  అప్​డేట్​ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 48 గంటల్లో పూర్తయి..  ఆ తర్వాత నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి. రాష్ట్ర సర్కార్​ కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తూ  వస్తున్నది. కానీ పరిస్థితి మాత్రం అట్ల లేదు. నెల కింద వడ్లు అమ్మిన రైతులకు కూడా ఇంకా వాళ్ల ఖాతాల్లో సొమ్ము జమ కావడం లేదు. ఎప్పుడు పడుతాయని రైతులు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి అడిగితే ‘స్టేటస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎం పెండింగ్‌‌'‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని సమాధానం వస్తున్నది. 

ఇంకా 12లక్షల టన్నులు కొనాలె

మొత్తం 80.49 లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ మొదట లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అకాల వర్షాలు, వడగండ్లతో పంట నష్టం వాటిల్లడంతో దిగుబడిపై ఎఫెక్ట్​ పడింది. పైగా ఆలస్యంగా కొనుగోళ్లు ప్రారంభించడం, కొనుగోలు సెంటర్లలో సమస్యల వల్ల చాలామంది రైతులు ప్రైవేట్​లో అమ్ముకుంటున్నారు. దీంతో సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ తాజాగా 62.49 లక్షల టన్నులకు వడ్ల సేకరణ లక్ష్యాన్ని కుదించుకున్నది. తాజా లక్ష్యం ప్రకారం.. ఇంకా 12 లక్షల  టన్నుల వడ్లను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.