భూమిని వెతుక్కుంటూ వెళ్లే ఓట్స్

భూమిని వెతుక్కుంటూ వెళ్లే ఓట్స్

భూమి సారవంతంగా ఉన్న చోట విత్తనాలు నాటితే మొలకలొస్తాయి. లేకపోతే అవి వృథాగా ఎండిపోతాయి. కానీ, విత్తనాలే సరైన భూమిని వెతుక్కుంటూ వెళ్లడం ఎప్పుడైనా చూశారా?
మామూలుగా ఏ చెట్టు విత్తనాలైనా మొలకెత్తాలంటే పక్షులు లేదా మనుషుల అవసరం ఉంటుంది. కానీ, వైల్డ్ ఓట్స్ అలా కాదు. వాటికి ఎవరి సాయం అవసరం లేదు. ఆ గింజలు వాటంతట అవే నేలపై కదులుతూ వెళ్లి సరైన చోట నాటుకుపోతాయి. వాటికి కావాల్సిన నీటిని కూడా అవే సేకరించుకుంటాయి. అడవుల్లో పెరిగే ఓట్స్‌‌ను ‘వైల్డ్ ఓట్స్’ అంటారు. ఇవి కంకి నుంచి వేరయ్యి కింద పడ్డాక మొలకెత్తడం కోసం పాకుతూ వెళ్తాయి.

మొలకెత్తడానికి భూమి ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడకెళ్లి సెటిల్ అవుతాయి. అందుకే వీటిని ‘వాకింగ్ ఓట్స్’, ‘యానిమేటెడ్ ఓట్స్’ అంటారు. ఈ ఓట్స్ గింజలకు ముల్లు లాంటి ఈకలు ఉంటాయి.  నేలపై పడగానే ఇవి  తొంభై డిగ్రీల కోణంలో విచ్చుకుని దొర్లుతూ.. గింజను కదిలేలా చేస్తాయి. ఆ ఈకలు వాతావరణంలో తేమను గ్రహిస్తూ మెల్లగా కదులుతాయి. అలా కొన్ని రోజుల తర్వాత భూమిలో పగుళ్లు ఉన్నచోట లేదా తేమ, నీడగా ఉన్నచోటకు వెళ్లి ఆగుతాయి. అప్పుడు అందులో ఉండే గింజ మొలకెత్తడం మొదలవుతుంది.