
ఒక్కడి ఆలోచన ఊరు రూపు రేఖలను మార్చింది. ఆయన తీసుకున్న ఓ నిర్ణయం ఆ ఊరికే మోడల్ అయ్యింది. త్వరలోనే ప్రతి ఇల్లు సోలార్ కాంతులతో మెరిసిపోబోతుంది. రియాజుద్దిన్ అన్సారీ అనే టైలర్ వేసిన ఒక్క అడుగు ఎంతోమందికి కొత్త దారి చూపించింది. ఊరంతా రెన్యువబుల్ ఎనర్జీ వాడకం వైపు అడుగులు వేసేలా చేసింది. జార్ఖండ్ రామ్‌ఘడ్డ్ జిల్లాలోని మగన్‌పూర్. బొగ్గు గనుల మధ్య ఉంటుంది ఆ ఊరు. కానీ, ఆ ఊళ్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించదు. బొగ్గు గనుల వల్ల వ్యవసాయం, ఫిషింగ్ లాంటి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే, అక్కడి వాళ్లంతా టైలరింగ్ మీద ఆధారపడ్డారు. వాళ్లలో ఒకరు రియాజుద్దిన్ అన్సారీ. అన్సారీ, ఆయన భార్య ఇద్దరూ మెషిన్ కుడతారు. వెస్ట్‌బెంగాల్‌లోని కొన్ని రెడీమేడ్ షాపులకు ఇక్కడ నుంచి బట్టలు కుట్టి పంపుతారు. రోజంతా మెషిన్ తొక్కి పనిచేస్తే కనీసం రూ.150 కూడా వచ్చేవి కాదు. కరెంట్ మిషన్ పెట్టుకునే స్తోమత లేదు. అంతేకాకుండా కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. అప్పుడే అన్సారీకి తన ఇంటిపైన సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. అలా ‘అగ్రాగటి’ అనే లోకల్ ఎన్జీవో, బెంగళూరుకు చెందిన సెల్కో ఫౌండేషన్ అనే కంపెనీ సాయంతో బ్యాంక్‌లో రూ.15,000లోన్ తీసుకుని సోలార్ ప్యానెల్స్‌ను పెట్టుకున్నాడు. దాంతో కష్టపడకుండా.. కరెంటు సాయంతో మెషిన్ కుడుతున్నారు అన్సారీ, ఆయన భార్య ఫాతిమా. ఇప్పుడు ఎక్కువ బట్టలు కుడుతున్నామని, రోజుకు దాదాపు రూ.250 వరకు సంపాదిస్తున్నామని చెప్పాడు అన్సారీ. అన్సారీ తన ఇంటిపైన ఈ సోలార్ ప్యానెళ్లు పెడుతున్నప్పుడు గ్రామప్రజలు మొదట్లో వింతగా చూశారు. కానీ, ఇప్పుడు అందరూ అన్సారీ బాటలో నడుస్తున్నరు. ఇప్పటివరకు 50మంది సోలార్ ప్యానెళ్లను పెట్టించుకున్నారు. డిసెంబర్ నాటికి ఆ లెక్క 200కు చేరుతుందని ఎన్జీవో సభ్యులు చెబుతున్నారు.