కాజీపేటలో కోచ్‌‌ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..

కాజీపేటలో కోచ్‌‌ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..
  • పదేళ్లుగా పరస్పర నిందలతో కాలం గడిపిన బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ
  • స్థలం ఇవ్వలేదన్న కేంద్రం, ఇచ్చినా పట్టించుకోలేదన్న రాష్ట్రం
  • కాజీపేటలో కోచ్‌‌ ఫ్యాక్టరీకి బదులు పీఓహెచ్‌‌ ఏర్పాటు
  • ఎయిర్‌‌పోర్టుకు సమస్యగా మారిన స్థల సేకరణ
  • కాజీపేట కోచ్‌‌ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్‌‌పోర్టు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ చుట్టూ మళ్లీ పార్లమెంట్‌‌ ప్రచారం

వరంగల్‍, వెలుగు : ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘కాజీపేట కోచ్‌‌ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్‌‌పోర్టు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ’ రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఎన్నికలు రాగానే వీటిని తెరమీదకు తెస్తూ ఓట్లు వేయించుకుంటున్న లీడర్లు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీంతో ఫ్యాక్టరీలు, ఎయిర్‌‌పోర్టు ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. 

కాజీపేట కోచ్‌‌ ఫ్యాక్టరీ హామీ @ 40 ఏండ్లు

ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని కలిపే సెంటర్‌‌ పాయింట్‌‌గా కాజీపేట జంక్షన్‌‌కు పేరుంది. ఇక్కడ కోచ్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరిక 40 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న టైంలో కాజీపేటకు కోచ్‌‌ ఫ్యాక్టరీ మంజూరు అయింది. ఇందుకోసం 1,500 ఎకరాల భూసేకరణ కూడా చేశారు. కానీ తర్వత కోచ్‌‌ ఫ్యాక్టరీని పంజాబ్‌‌కు తరలించారు. తర్వాత మరోసారి చాన్స్‌‌ ఇచ్చినా వివిధ కారణాలతో మళ్లీ ఆగిపోయింది. 2001లో తెలంగాణ ఉద్యమం పేరుతో ముందుకొచ్చిన టీఆర్‌‌ఎస్‌‌ కాజీపేట కోచ్‍ ఫ్యాక్టరీ సాధన నినాదంతో జనాల్లోకి వెళ్లింది. 

2014లో తెలంగాణలో కేసీఆర్‌‌ సీఎం కాగా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత పదేళ్ల పాటు కోచ్‌‌ ఫ్యాక్టరీ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు  స్థలం ఇవ్వడం లేదంటూ కేంద్రం, స్థలం ఇచ్చినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం పరస్పర నిందలు వేసుకున్నాయి. తీరా 2019లో బీజేపీ మాట మార్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా కోచ్‌‌ ఫ్యాక్టరీలు అవసరం లేదంటూనే మహారాష్ట్రలోని లాతూర్‍, అసోంలోని కొక్రాజార్‌‌లో కోచ్‌‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేసింది. కాజీపేటలో పీఓహెచ్‌‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రధాని, గతేడాది జులైలో శంకుస్థాపన సైతం చేశారు. కోచ్‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదంటూ బీఆర్‌‌ఎస్‌‌ ఇప్పటివరకు చెబుతూనే ఉంది.

ఎయిర్‍పోర్ట్‌‌కు స్థలం లొల్లి

వరంగల్‌‌ సమీపంలోని మామునూరులో 1930లో ఏర్పాటు చేసిన ఎయిర్‌‌పోర్ట్‌‌ సౌత్ ఏషియాలోనే పెద్దదిగా రికార్డుల్లో నమోదైంది. 1981 వరకు ఇక్కడికి విమాన రాకపోకలు కొనసాగి ఆ తర్వాత బంద్‌‌ అయ్యాయి. చివరి నిజాం మీర్‌‌ ఉస్మాన్‌‌ ఖాన్‌‌ షోలాపూర్‌‌, కాగజ్‌‌నగర్‌‌ వంటి ఏరియాల్లో వ్యాపారాలు చేసే క్రమంలో మామునూరు నుంచే విమాన ప్రయాణాలు సాగించేవారు. ఈ ఎయిర్‌‌పోర్టును ఓపెన్‌‌ చేసేందుకు 2007 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌‌పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంవోయూ చేసుకున్నాయి. 2017లో ఉడాన్‌‌ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం వరంగల్‍ ఎయిర్‌‌పోర్ట్‌‌ ప్రారంభించేందుకు 1,200 ఎకరాలు అవసరమని చెప్పింది. మామునూరు ఎయిర్‌‌పోర్టును మొదట్లో 1,871 ఎకరాల్లో ఏర్పాటు చేయగా భూములు క్రమంగా ఆక్రమణకు గురై చివరికి 775 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. 

భూ సేకరణ చేసి మిగిలిన భూమిని అప్పగించాలని రాష్ట్రానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కనీసం మరో 253 ఎకరాలైన సేకరించి ఇస్తే ఎయిర్‌‌పోర్ట్‌‌ ఓపెన్‌‌ చేస్తామని ఆఫీసర్లు సూచించారు. భూ సేకరణలో నష్టపోయే రైతులకు పరిహారంగా మామునూరులోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన 373.02 ఎకరాల భూములను ఖిలా వరంగల్ తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు ట్రాన్స్‌‌ఫర్ చేయాలని వరంగల్‌‌ కలెక్టర్‌‌ అప్పటి కేసీఆర్‌‌ సర్కార్‌‌కు ప్రపోజల్స్‌‌ పంపారు. దీనిపై బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం స్పందించలేదు. పైగా వరంగల్‌‌లో ఎయిర్‌‌పోర్టు ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్‌‌లోని ఎయిర్‌‌పోర్టు నిర్వహణ చూస్తున్న జీఎంఆర్‌‌ సంస్థను ఒప్పించాల్సి ఉంది. దీంతో ఎయిర్‌‌పోర్టు విషయం ముందుకు సాగడం లేదు.

ఇవే హామీలతో మళ్లీ ఎన్నికలకు.. 

ఓరుగల్లుకు రావాల్సిన ప్రధాన ప్రాజెక్ట్‌‌లు ఒక్కొక్కటిగా తరలివెళ్తుంటే రాజకీయాలు చేసిన అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అవే హామీలను ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. కాజీపేటలో కోచ్‌‌ ఫ్యాక్టరీ, మామూనూరులో ఎయిర్‌‌పోర్ట్‌‌, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటే తమ లక్ష్యాలంటూ చెబుతున్నారు. వీటిని సాధించేందుకు తమను గెలిపించాలంటూ బీజేపీ, బీఆర్‍ఎస్‍ ఎంపీ క్యాండిడేట్లు ప్రజల్లో తిరుగుతున్నారు.

ముందుకు సాగని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ 

రాష్ట్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశం బీజేపీ, బీఆర్‍ఎస్‍ రాజకీయ పంచాయతీకే పనికొచ్చింది. దేశంలోని ఖనిజ నిల్వల్లో 11 శాతంతో బయ్యారంలో క్వాలిటీ ఐరన్‌‌ ఉందని బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బీజేపీ సైతం రిపోర్టులు, కమిటీలు అంటూ దాదాపు తొమ్మిదేళ్లు కాలయాపన చేసింది. పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా టాస్క్‌‌ఫోర్స్‌‌ అధ్యయనంలో హెమటైట్‌‌ ఓర్‌‌ 10 మిలియన్‌‌ టన్నులు, మేగ్నటైట్‌‌ ఓర్‌‌ 400 టన్నులు ఉన్నట్లు రిపోర్ట్‌‌ ఇచ్చింది. అయినా ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రం ముందుకు సాగడం లేదు.