
మంచు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ,కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మండి జిల్లాలోని సుందర్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు రాబోయే 25 ఏండ్లలో జరగాల్సిన అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, సుస్థిర ప్రభుత్వం రావాలన్నా బీజేపీని మళ్లీ గెలిపించాలని కోరారు. బీజేపీ అంటే సుస్థిరత, సేవా భావం, సమానత్వానికి మారుపేరు అని మోడీ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.