కరోనాతో అన్నీ డిజిటల్​ మయం

కరోనాతో అన్నీ డిజిటల్​ మయం
  • మోసాలు పెరగడానికి  అదే కారణమవుతోంది
  • ఎనలిటిక్స్​ను బ్యాంకులు​ ఎక్కువగా వాడాలి
  • డెలాయిట్​ సర్వే రిపోర్టు

న్యూఢిల్లీ: కొవిడ్​–19తో డిజిటల్​ ట్రాన్సాక్షన్లు భారీగా పెరగడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్లను మోసం చేసేవాళ్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని డెలాయిట్​ ఇండియా ఒక రిపోర్టులో వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో ఏ కారణాల వల్ల మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందో కూడా ఈ రిపోర్టులో తెలిపింది. ఉద్యోగులలో చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తుండటం, నాన్​–బ్రాంచ్​ బ్యాంకింగ్​ ఛానల్స్​ వాడటం, ఫోరెన్సిక్​ ఎనలిటిక్స్​ టూల్స్​ను తగినంతగా బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్లు వాడకపోవడం వల్ల మోసాలు ఎక్కువయ్యే సూచనలున్నాయని డెలాయిట్​ టచ్​ తొమాట్సు ఇండియా ఈ రిపోర్టులో విశ్లేషించింది. ఫ్రాడ్​ రిస్క్​ మేనేజ్​మెంట్​, ఆడిట్​– ఫైనాన్స్​, ఎసెట్​ రికవరీ విభాగాలలోని 70 మంది సీనియర్​ ఆఫీసర్లతో చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయినట్లు పేర్కొంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్ల సీనియర్​ ఆఫీసర్లు తమ సర్వేలో పాల్గొన్నట్లు వివరించింది. రాబోయే రెండేళ్లలో మోసాలు మరింత పెరుగుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది.

మోసాలు ఎక్కువగా రిటెయిల్​ బ్యాంకింగ్​లోనే చోటు చేసుకుంటాయని 53 శాతం మంది సర్వేలో చెప్పారని, గత రెండేళ్లలో ఇలాంటి మోసాలు వంద శాతం పెరగడాన్ని తాము చూసినట్లు పేర్కొన్నారని డెలాయిట్​ రిపోర్టు వెల్లడించింది. అంతకు మునుపు తమ రిపోర్టుతో పోలిస్తే మోసాలు 29 శాతం పెరిగాయని వివరించింది. నాన్​–రిటెయిల్​ సెగ్మెంట్లో మోసాలు సగటున 20 శాతం పెరిగాయని 56 శాతం మంది సీనియర్​ ఆఫీసర్లు చెప్పినట్లు తెలిపింది. డేటా థెఫ్ట్​, సైబర్​ క్రైమ్​, థర్డ్​పార్టీ ఇండ్యూస్డ్​ ఫ్రాడ్​, ఫ్రాడ్యులెంట్​ డాక్యుమెంటేషన్​...తమకు ఎదురవుతున్న ప్రధానమైన సవాళ్లని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది వెల్లడించారు. కొవిడ్​–19 వల్ల తమ ఫ్రాడ్​ రిస్క్​ మేనేజ్​మెంట్​ (ఎఫ్​ఆర్​ఎం) విభాగాలలో ఎనలిటిక్స్ వాడకం పెరిగిందని, మోసాలు కనుక్కోవడానికి వాటిపైనే ఆధారపడుతున్నామని బ్యాంకులు, ఫైనాన్షియల్​ఇన్​స్టిట్యూషన్ల సీనియర్​ ఆఫీసర్లు చెబుతున్నట్లు డెలాయిట్​ సర్వే పేర్కొంది. కస్టమర్లు, ఉద్యోగులలో మోసాలపై అవగాహన పెంచాల్సి వస్తోందని, టార్గెట్​ ఆపరేటింగ్​ మోడల్​లో మార్పులు చేసుకోవాల్సి వస్తోందని కూడా ఆ సీనియర్​ ఆఫీసర్లు పేర్కొన్నట్లు వివరించింది.​ కరోనా వైరస్​వల్ల దేశంలోను, గ్లోబల్​గానూ ఆపరేషన్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని డెలాయిట్​ పార్ట్​నర్​ కే వీ కార్తిక్​ చెప్పారు. డిజిటల్​ చానల్స్​ వాడకం వల్ల ఒకవైపు ట్రాన్సాక్షన్ల వేగం పెరిగిందని, కానీ, మరోవైపు టెక్నాలజీ వినియోగంతో బిజినెస్​ మోడల్స్​లో కాంప్లెక్సిటీ కూడా అధికమైందని పేర్కొన్నారు. ఫ్రాడ్​ రిస్క్​ ఎసెస్​మెంట్లను ఏడాదికోసారి చేపడుతున్నామని, రిజిస్టర్​లో అప్​డేట్​ చేస్తున్నామని సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది చెప్పారు.