ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు

మంబయి: మావోయిస్టులతో  లింకులున్నాయనే  కేసులో శిక్ష అనుభవిస్తున్న  ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలంటూ కోర్టు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2017లో  గచ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు.  జస్టిస్ రోహిత్ డియో, జస్టిస్ అనిల్ పన్సారేలతో కూడిన బాంబే హైకోర్టు బెంచ్ ప్రొఫెసర్ సాయిబాబా కేసును ఇవాళ విచారణకు చేపట్టింది. ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని కూడా  కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఇంతకీ ఏం జరిగింది?

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై  ప్రొఫెసర్ సాయిబాబా, మరో ఐదుగురిపై 2017లో యుఏపీఏ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిబాబా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి  గచ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.