
బెంగళూరు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ రత్న ప్రభ బీజేపీలో జాయిన్ అయ్యారు. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. కలబుర్గిలో కర్ణాటక రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యెడ్యూరప్ప సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు.
ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివృద్ధి చేస్తున్నారని రత్నప్రభ చెప్పారు. దేశంకోసం మరింత సేవచేయాలని నిర్ణయించుకున్న తనకు.. బీజేపీ సరైన ప్లాట్ ఫామ్ గా భావించానని అన్నారు.
1981 ఐఏఎస్ కేడర్ కు చెందిన రత్నప్రభ తెలుగువారు. కర్ణాటకలో మూడో మహిళా చీఫ్ సెక్రటరీగా రికార్డుల కెక్కారు. 2018 జూన్ లో ఆమె రిటైర్ అయినప్పటినుంచి రాజకీయాల్లోకి రావడంపై రకరకాలుగా చర్చ జరిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న రత్నప్రభను సీఎస్ గా నియమించకపోవడంపై బీజేపీ అప్పట్లోనే అభ్యంతరం తెలిపింది. రత్న ప్రభ SC సామాజికవర్గానికి చెందిన అధికారి. రాష్ట్ర ప్రభుత్వ SC, ST ఉద్యోగులకు పదోన్నతులు రావడంలో ఆమె విశేష కృషి చేశారు. 2016లో ఇన్వెస్ట్ కర్ణాటక సమ్మిట్ ను నిర్వహించి.. అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్ స్టిట్యూషన్ వారి ఉమన్ ఆఫ్ ఇయర్ అవార్డ్ ను ఆమె దక్కించుకున్నారు. మొదట్లో రాయచూర్ జిల్లాకు మొదటి మహిళా కలెక్టర్ గా విధులు నిర్వహించారు రత్నప్రభ. ఈమెకు కీలక బాధ్యతలు అప్పగించి… నార్త్ – వెస్ట్ కర్ణాటకలో మంచి ఫలితాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.