సీఎం రేవంత్​, కోదండరాం .. 2 లక్షల ఖాళీల వివరాలు చెప్పాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్

సీఎం రేవంత్​, కోదండరాం  .. 2 లక్షల ఖాళీల వివరాలు చెప్పాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్
  • సీఎం రేవంత్​, కోదండరాం .. 2 లక్షల ఖాళీల వివరాలు చెప్పాలి
  • ఫిబ్రవరి చివరి కల్లా వెల్లడించండి
  • కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసి ఓట్లు దండుకుంది
  • 7 వేల స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ క్రెడిట్ బీఆర్ఎస్ సర్కార్ దే 
  • కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి,  కోదండరాం ఎన్నికల సమయంలో చెప్పారని, ఆ ఖాళీలు ఏయే శాఖల్లో ఉన్నాయో గుర్తించి ఫిబ్రవరి చివరికల్లా వివరాలు వెల్లడించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 2024 డిసెంబర్ 24 వరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. కరీంనగర్ క్యాంపు ఆఫీసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు.

పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 42,652 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7వేల స్టాఫ్ నర్సు పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిందన్నారు.

తాను నాన్ లోకల్ అంటూ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాను కరీంనగర్ లోనే పుట్టానని, తల్లిది కరీంనగర్, తండ్రిది హన్మకొండ అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ కార్మిక విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రూప్ సింగ్, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడ జక్కుల నాగరాజు యాదవ్, దూలం సంపత్ గౌడ్, ద్యావ మధుసూదన్ రెడ్డి, సత్యం యాదవ్,  తిరుపతి నాయక్ పాల్గొన్నారు.