సైన్స్ టీచర్.. బోధన సూపర్... హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సూట్ ధరించి సైన్స్ పాఠాలు

సైన్స్ టీచర్.. బోధన సూపర్... హ్యూమన్  ఇంటర్నల్  ఆర్గాన్స్  సూట్  ధరించి సైన్స్  పాఠాలు
  • ఈజీగా అర్థమయ్యేలా టీచింగ్ లో కొత్త ట్రెండ్ 
  • స్కూల్  యూనిఫామ్ లోనే బడికి 
  • పిల్లలకు ప్రకృతి పాఠాలు నేర్పిస్తున్న టీచర్​ శ్రీనివాస్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఫిల్టర్  బెడ్  ప్రైమరీ స్కూల్  సైన్స్  టీచర్  జలంపల్లి శ్రీనివాస్  విద్యాబోధనలో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. మానవ శరీరంలోని అవయవాలు, వాటి ప్రాధాన్యం, పనితీరు పిల్లలకు అర్థమయ్యేలా చెబుతూ వారిని ఆకట్టుకుంటున్నాడు. హ్యూమన్  ఇంటర్నల్  ఆర్గాన్స్  ప్రింట్  చేసిన టీ షర్ట్స్, బాడీ సూట్స్  ధరించి వారికీ ఈజీగా అర్థమయ్యేలా బోధిస్తూ కొత్త ట్రెండ్ కు తెరదీశాడు. ఇందుకోసం స్పెషల్ గా ‘ఇంటర్నల్  ఆర్గాన్స్  ఆఫ్  ది బాడీ ఆన్  టీ షర్ట్’,  ‘ఇంటర్నల్  ఆర్గాన్స్ - ఫుల్  బాడీ సూట్’ తయారు చేయించాడు. 

క్లాస్ రూమ్ లో వాటిని ధరించి ‘మానవ శరీర నిర్మాణం, అస్థిపంజర వ్యవస్థ, కండరాలు, మెదడు, -నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ, శ్వాసకోశ, జీర్ణ, విసర్జన వ్యవస్థ’ గురించి వివరిస్తూ ఏ అవయవం ఎలా పని చేస్తుందో చెబుతున్నాడు. మానవ శరీరం, అంతర్గత అవయవాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ విధానంలో బోధించిన వీడియోను విద్యా అమృత్  మహోత్సవాల్లో భాగంగా నేషనల్  లెవెల్  కాంపిటేషన్ కు పంపించాడు. 

ఇన్నోవేటివ్  టీచింగ్  విభాగంలో రాష్ట్రం నుంచి ఐదు వీడియోలను సెలెక్ట్  చేయగా అందులో శ్రీనివాస్  వీడియో కూడా ఒకటి. బొమ్మలతో బోధిస్తే సులభంగా అర్ధం కావడంతో పాటు విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుంటుందని శ్రీనివాస్ అంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం, స్కూల్  లీడర్​షిప్  అకాడమీ న్యూఢిల్లీ వారు ముద్రించిన ‘రైస్లండ్లైన్  ఇన్​సైట్స్  ఆఫ్  న్యూ ఏజ్  స్కూల్  లీడర్స్’ బుక్ లో శ్రీనివాస్  టీచింగ్  మెథడ్ కు స్పేస్  కల్పించారు. 

అస్సాం గౌహతిలో నిర్వహించిన ఆన్​లైన్  వెబినార్ లో శ్రీనివాస్  పాల్గొని పుస్తకంలోని అంశాలను వివరించి ప్రశంసలు అందుకున్నాడు. వివిధ రాష్ట్రాల్లో పలువురు టీచర్లు విద్యాబోధనలో శ్రీనివాస్ ను ఫాలో అవుతున్నారంటే ఆయన టీచింగ్  మెథడ్  ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

యూనిఫాంలోనే బడికి...

సైన్స్  టీచర్  శ్రీనివాస్ పిల్లలతో స్నేహంగా మెలుగుతున్నాడు. టీచర్  అనే భయాన్ని పిల్లలకు కలగనీయకుండా తాను కూడా స్కూల్  యూనిఫామ్ లోనే బడికి వెళుతూ వారిలో ఒకడిగా కలిసిపోతున్నాడు. తాను ఏ స్కూల్​లో పని చేసినా ఇదే ట్రెండ్  ఫాలో అవుతుండడం అందరినీ ఆకట్టుకుంటుంది.  పిల్లలను క్లాసు రూమ్ కే పరిమితం చేయకుండా వారిని తరచూ టూర్లకు తీసుకెళ్తూ కొత్త ప్రదేశాలను, చరిత్ర, సంస్కృతిని పరిచయం చేసేందుకు పరితపిస్తున్నాడు. 

రైతు కష్టం విలువ తెలిసేలా వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి చూపిస్తున్నాడు. దీంతో స్టూడెంట్లు వివిధ అంశాలపై అవగాహన పెంచుకుంటూ భవిష్యత్తులో అన్నిరంగాల్లో రాణించేలా ఆయన తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాకుండా సోపతి వెల్ఫేర్  సొసైటీ, కోవిడ్  వాలంటీర్స్, భీమ్ పుత్ర ఫౌండేషన్  పేరిట అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకు, పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు సోషల్  మీడియా వేదికగా నిధులు సేకరించి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు.