భార్యాభర్తలకి ఆ తెలివి ఉండాలి

భార్యాభర్తలకి ఆ తెలివి ఉండాలి

సంధ్య, రాము.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. పెద్దల్ని ఒప్పించి పెండ్లి కూడా చేసుకున్నారు. మొదట్లో అన్యోన్యంగా ఉన్న ఆ జంట మధ్య .. కొన్నాండ్లకి అపార్థాలు మొదలయ్యాయి. సంధ్య ఏదైనా విషయంలో కోప్పడితే.. రాము చెయ్యి చేసుకునేవాడు. ఆమె ఏడిస్తే కసిరేవాడు. రాము ఏ చిన్న పొరపాటు చేసినా సంధ్య కూడా గట్టిగట్టిగా అరిచేది, తిట్టేది. ఇంట్లో సామాన్లు విసిరేసేది. మ్యారేజ్​ కౌన్సెలర్​ని కలిస్తే.. వాళ్లు మారిటల్​ హేట్రెడ్​​తో బాధపడుతున్నారని తెలిసింది. ఎమోషనల్​​ ఇంటెలిజెన్స్​ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందన్నారు కౌన్సెలర్లు. అసలు  మారిటల్​ హేట్రెడ్​,

ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ అంటే ఏంటి?  ఇవి రిలేషన్​ని ఎలా ఎఫెక్ట్​ చేస్తాయి?

భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సందర్భాల్లో  బంధాన్ని మరింత బలపరుస్తాయి. కానీ, ఎప్పుడైతే ఆ గొడవలు వాళ్లని పర్సనల్​గా ఎఫెక్ట్​ చేస్తాయో.. భార్యాభర్తలు ఒకరిలోని లోపాల్ని మరొకరు సహించలేకపోతారో అదే మారిటల్​ హేట్రెడ్. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఏ రిలేషన్​లో అయితే మితిమీరిన నెగెటివిటీ, ఫ్రస్ర్టేషన్​ ఉంటుందో దాన్నే మారిటల్​ హేట్రెడ్​​ అంటారు సైకాలజిస్ట్​లు. దీనికి కారణం పార్ట్​నర్స్​లో ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ లేకపోవడమే.. 

ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ అంటే ...

ఐ.క్యు.( ఇంటెలిజెంట్​ కోషెంట్​) గురించి అందరికీ తెలిసిందే. ఒక వ్యక్తి తెలివితేటల్ని లెక్క కట్టి చెప్తుంది ఇది. అచ్చు ఇలాగే.. ఎదుటివాళ్ల ఎమోషన్స్​ని ఫీల్​ అవ్వడం, అర్థం చేసుకోవడం, వాటికి తగ్గట్టు నడుచుకునే సామర్థ్యాన్ని ఎమోషనల్​ ఇంటెలిజెన్స్(ఈ.క్యూ.) అంటారు​. అలాగే ఎవరికి వాళ్లు వాళ్ల ఫీలింగ్స్​, ఎమోషన్స్​ని అర్థం చేసుకోవడం..హెల్దీ పద్ధతిలో వాటిని పార్ట్​నర్​కి చెప్పడం కూడా ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ కిందే వస్తుంది. 

ఈ.క్యూ. లేకపోతే..  

హెల్దీ రిలేషన్​కి బ్రిడ్జ్​ లాంటిది ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ . పార్ట్​నర్స్​కి అది లేకపోతే ఒకరి ఎమోషన్స్​ గురించి మరొకరు ఆలోచించరు. ఇద్దరి మధ్యా గొడవ జరిగితే.. ఎదుటివాళ్లు బాధపడతారేమోనన్న ఆలోచన లేకుండా నిందించుకుంటారు. ఇంతకుముందు చేసిన తప్పుల్ని తవ్వి తీస్తుంటారు. లోపాల్ని ఎత్తి చూపించుకుంటారు. అలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్​ అవడం వల్ల.. రిలేషన్​లో నెగెటివిటీ పెరుగుతుంది. అది మారిటల్​ హేట్రెడ్​​కి దారితీస్తుంది. 

ఒకరికుంటే సరిపోదు

ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ పార్ట్​నర్స్​లో ఒకరికున్నా బంధం నిలబడుతుందా? అంటే లేదు. భార్య లేదా భర్తలో ఒకరు మాత్రమే ఎమోషనల్​గా​ ఇంటెలిజెంట్​ అయితే.. ప్రతి సిచ్యుయేషనల్​ వాళ్లే పార్ట్​నర్​ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వాళ్లే ప్రతిసారీ కాంప్రమైజ్​ అవుతారు. దాంతో రిలేషన్​ని నిలబెట్టుకునే బాధ్యతంతా వాళ్లపైనే పడుతుంది. అలా ఎక్కువ రోజులు వాళ్ల ఎమోషన్స్​ని దాచుకుంటూ..పార్ట్​నర్​ని కంఫర్ట్​ జోన్​లో ఉంచడం వల్ల.. రానురాను సమస్య మరింత తీవ్రం అవుతుంది. అది బంధాన్ని మరింత బలహీనం చేస్తుంది. అందుకే భార్యాభర్తలిద్దరూ ఈ.క్యూ.ని అలవాటు చేసుకోవాలి.  పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎదుటి వాళ్ల ఎమోషన్స్, ఫీలింగ్స్​  అర్థం చేసుకోవాలి.  అప్పుడే ఎన్ని సమస్యలొచ్చినా బంధం బలంగా ఉంటుంది. ఒక్క భార్యభర్తలే  కాదు ఫ్రెండ్స్​, ఫ్యామిలీ.. ఇలా ఏ రిలేషన్​లోనైనా ఎమోషనల్​ ఇంటెలిజెంట్ ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే. 

సమస్యని చూడటంలో మార్పు

భార్యాభర్తలకి ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​ ఉంటే.. సందర్భం ఏదైనా  ఎదుటి వాళ్ల దృష్టి నుంచి కూడా సమస్యని చూస్తారు. ఊదాహరణకి పార్ట్​నర్​​ గొడవపడుతుం టే.. దానికి దారితీసిన కారణాలు, వాళ్లని ఎమోషనల్​గా అంత బాధ పెట్టిన విషయం ఏంటని ఆలోచిస్తారు. ఏదైనా అబద్ధం చెప్తే.. నిజం చెప్పకపోవడం వెనకున్న కారణాన్ని అర్థం చేసుకుంటారు. పార్ట్​నర్​ చిరాకు పడ్డా, ఫ్రస్ట్రేషన్​లో ఉన్నా.. ఓవరాల్​గా వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తు న్నారన్న విషయాన్నే చూస్తారు. వాళ్ల ఎమోషన్స్​ని ఫీలై.. దానికి తగ్గట్టుగా మాట్లాడతారు. వాళ్ల ఫీలింగ్స్​కి రెస్పెక్ట్​ ఇస్తారు. వాళ్లని కంఫర్ట్​గా ఉంచుతారు. దానివల్ల ఇద్దరి మధ్యా ఎంత పెద్ద గొడవ జరిగినా.. దానంతట అదే సద్దుమణుగుతుంది.