
ఎన్నికల వేళ కారులో డబ్బు తరలిస్తూ స్వయంగా దొరికిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేడ్చల్‌లోని మేడిపల్లి మండలం చెంగిచర్లలో డబ్బుతో దొరికిపోయాడు అంజిత్ రావ్, దీంతో డబ్బుతో పాటుగా కారును కూడా అధికారులు సీజ్ చేశారు. పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్లినందుకు అంజిత్ రావును సస్పెండ్ చేస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
నవంబర్ 27న వరంగల్ నుంచి కారులో డబ్బును తీసుకొని వెళ్తుండగా కాంగ్రెస్ నేతలు ఆయనను అడ్డుకుని పట్టుకున్నారు. సుమారుగా రూ. 6 లక్షల వరకు నగదును సీజ్ చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ఇక పోలింగ్ కు ఒక్కరోజే టైమ్ ఉండటంతో రాష్ట్రంలో పలు చోట్ల పోటాపోటీగా భారీగా నగదు, ఉచితాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు నగదు పంపిణీ చేస్తుండగా, కొన్ని నియోజకవర్గాల్లో మిగతా పార్టీలకు దీటుగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బీజేపీ క్యాండిడేట్లు బిజీగా ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు సుమారు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ ఓటర్లకు ఈసారి భారీగా ముట్టజెప్తున్నట్లు సమాచారం.