ఏసీబీకి పట్టుబడ్డ జడ్చర్ల ఎక్సైజ్ సీఐ

ఏసీబీకి పట్టుబడ్డ జడ్చర్ల ఎక్సైజ్ సీఐ
  • కల్లు దుకాణ లైసెన్స్ కోసం రూ.90 వేలు డిమాండ్

జడ్చర్ల టౌన్, వెలుగు : కల్లు దుకాణ లైసెన్స్ ఇవ్వడానికి వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ ఏసీబీ ఆఫీసర్లకు దొరికాడు. మహబూబ్​నగర్​ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ కథనం ప్రకారం..జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగుకు చెందిన  తిరుపతయ్య గౌడ్ 2‌‌0 ఏండ్ల నుంచి కల్లు వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కొడుకులైన శ్రీకాంత్, శ్రీహరి పేరిట కల్లు దుకాణ లైసెన్స్ కోసం ఈ నెల 17న జిల్లా కేంద్రంలోని ఈఎస్ ఆఫీస్​లో  అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎంక్వైరీలో భాగంగా ఆఫీసర్లు జడ్చర్ల సీఐని కలవాలని చెప్పగా, 18న తిరుపతయ్య జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీని కలిశాడు. అయితే, ఉన్నతాధికారులకు రిపోర్ట్​ పంపాలంటే రూ.90 వేలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశాడు.

మరుసటి రోజు తిరుపతయ్య వచ్చి డబ్బులు తగ్గించుకోవాలని కోరగా, అర్జంట్​గా కొన్ని డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో తిరపతయ్య రూ.25 వేలు ఇచ్చాడు. మిగతా రూ.65 వేలు ఈ నెల 22న ఇవ్వాలని సీఐ చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం తిరుపతయ్య రూ.65 వేలు సీఐకి ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. విచారణ తర్వాత మంగళవారం నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.