కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగిస్తే.. ఈ చిన్న బిజినెస్లకు లాభాలెన్నో!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగిస్తే.. ఈ చిన్న బిజినెస్లకు లాభాలెన్నో!
  • డిమాండ్​ పెరిగే చాన్స్.. వర్కింగ్ క్యాపిటల్ సమస్యకు పరిష్కారం
  • మరింత వేగంగా రీఫండ్స్

న్యూఢిల్లీ: కొత్త జీఎస్టీ విధానం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎంఈలు)  చాలా సమస్యలు తగ్గుతాయని, వ్యాపారం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ 2.0 అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న నాలుగు శాతాల పన్నుల శ్లాబులను (5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) రెండు శ్లాబులుగా (5 శాతం, 18 శాతం) మార్చనున్నారు.  విలాసవంతమైన, హానికరమైన వస్తువులకు ప్రత్యేకంగా 40 శాతం పన్నును వసూలు చేయాలని ప్రతిపాదించారు.  దీని వల్ల ఎంఎస్​ఎంఈలకు ఎదురయ్యే వర్గీకరణ వివాదాలు, న్యాయపరమైన సమస్యలు తగ్గుతాయి. కొన్ని ఎంఎస్​ఎంఈలకు ఇన్వర్టెడ్ ​డ్యూటీ స్ట్రక్చర్​కారణంగా ఎదురవుతున్న సమస్య పరిష్కారమవుతుంది.  ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ (ఐసీటీ) పేరుతో నిలిచిపోయిన వర్కింగ్​ క్యాపిటల్​ అందుబాటులోకి వస్తుంది.

వినియోగ వస్తువులపై పన్ను తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఎంఎస్​ఎంఈలకు డిమాండ్​ను పెంచుతుంది. పీహెచ్​డీ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ (పీహెచ్​డీసీసీఐ) ఇన్​డైరెక్ట్​ ట్యాక్స్​ కమిటీ  చైర్​పర్సన్​  ప్రమోద్​ కుమార్​ రాయ్​ మాట్లాడుతూ.. ‘‘పన్నుల శ్లాబులను తగ్గించడం వల్ల వివాదాలు తగ్గుతాయి. ఉదాహరణకు, ఒక క్లాత్​ ధర రూ. వెయ్యి ఉందనుకుందాం. వ్యాపారి 20 శాతం తగ్గింపుతో రూ. 800కు అమ్ముతున్నారు. తయారీదారు దీనిని 12 శాతం శ్లాబు కింద, పన్ను అధికారులు 18 శాతం శ్లాబు కింద లెక్కిస్తుంటారు. ఇలాంటి గందరగోళం ఇక నుంచి ఉండదు” అని ఆయన వివరించారు. 

తగ్గనున్న ధరలు
జీఎస్టీలో మార్పుల వల్ల కొన్ని హోం అప్లయన్సెస్, కార్లు, దుస్తులపై పన్ను తగ్గుతుంది. 28 శాతం శ్లాబులో ఉన్న 90 శాతం ఉత్పత్తులు 18 శాతం కేటగిరీకి, 10 శాతం ఉత్పత్తులు 40 శాతం కేటగిరీకి వెళ్లే అవకాశం ఉంది.  12 శాతం శ్లాబులో ఉన్న 99 శాతం ఉత్పత్తులు 5 శాతం శ్లాబులోకి, మిగిలిన ఒక శాతం ఉత్పత్తులు 18 శాతంలోకి వెళ్తాయి. ఈ పన్ను తగ్గింపు వల్ల రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్,​ ఓవెన్లు వంటి వాటి ధరలు 10 శాతం వరకు తగ్గుతాయి. టూవీలర్లు, ఎంట్రీ-లెవల్​ కార్లు 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి వస్తాయి. సిమెంట్​ కూడా 28 శాతం నుంచి 18 శాతం శ్లాబులోకి మారుతుంది. దీంతో  నిర్మాణ రంగానికి మేలు జరుగుతుంది.  

రూ. వెయ్యి లోపు ధర ఉన్న దుస్తులపై 5 శాతం జీఎస్టీ, మిగిలిన వాటిపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల అనేక ఉత్పత్తులు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చి, వినియోగం పెరుగుతుందని రాయ్​ తెలిపారు.  అయితే, జీఎస్టీ 2.0 ఎంఎస్​ఎంఈలకు దీపావళి బహుమతి కావాలంటే కొన్ని సవాళ్లను పరిష్కరించాలని ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ మైక్రో అండ్​ స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్‌‌ప్రైజెస్ సెక్రటరీ జనరల్​ అనిల్​ భరద్వాజ్​ అన్నారు. ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా  జీఎస్టీ రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి రావడం, వేర్వేరు ఆడిట్‌‌లు, ఇన్వెస్టిగేషన్లు ఎదుర్కోవడం ఎంఎస్​ఎంఈలకు సమస్య అని ఆయన చెప్పారు. ఐటీసీ విషయంలో ఉన్న నియమాలు కూడా వ్యాపారులకు సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.