తుపాన్ల ప్రభావంతో నవంబర్లో అధిక వర్షాలు పడొచ్చంటున్న నిపుణులు

తుపాన్ల ప్రభావంతో నవంబర్లో అధిక వర్షాలు పడొచ్చంటున్న నిపుణులు
  • స్థానిక వాతావరణ మార్పులపై స్టడీ చేయాలి 
  • డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచన 
  • ఎలాంటి ప్రయత్నాలు చేయని రాష్ట్ర సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. నవంబర్​లోనూ అధిక వర్షాలు పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రత పెరుగుదల, వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా అధికంగా వానలు పడుతున్నాయని అంటున్నారు. ‘‘సాధారణంగా నవంబర్​లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా తుఫాన్లు వస్తాయి. వీటి వల్ల తెలంగాణలోనూ వర్షాలు పడడం సహజం. అయితే ఇప్పుడవి ఎన్ని రోజులు? ఎంత తీవ్రతతో పడతాయన్నది మాత్రం చెప్పలేం” అని పేర్కొన్నారు. అసలు అక్టోబర్​లో వర్షాలే ఉండవని, కానీ ఇపుడు అధిక వర్షాలు పడుతున్నాయని చెప్పారు. గతంలో సాధారణ వర్షపాతంతో ఎక్కువ రోజులు వానలు పడేవని.. కానీ ఇప్పుడు రెయినీ డేస్ తగ్గిపోయి, ఇంటెన్సివ్ రెయినీ డేస్ ల సంఖ్య పెరుగుతోందని వాతావరణ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ తెలిపారు. 

లోకల్​గా వచ్చే మార్పులతోనే... 
స్థానికంగా వాతావరణంలో వచ్చే మార్పులే అనూ హ్య వర్షాలకు కారణమవుతున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు చెప్పారు. ‘‘అక్టోబర్ లో వాతావరణం చల్లగా ఉండాలి. కానీ ఇప్పుడు ఎండ వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లోనూ వేడిగా ఉంటోంది. ఇది మంచి పరిణామం కాదు” అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావం అన్ని దేశాలపై ఉంటుందన్నారు. ‘‘ఒకప్పుడు జూబ్లీహిల్స్​లో ఎండాకాలంలోనూ ఎంతో చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు విపరీతమైన వేడి ఉంటోంది. కింద బాగా వేడిగా ఉంటే అటువైపుగా వచ్చే చల్లటి మేఘాల కారణంగా వానలు పడడం సహజం. అందుకే అక్టోబర్​లోనూ వర్షాలు పడుతున్నాయి’’ అని వివరించారు. అక్టోబర్ నెలాఖరు వచ్చినా వానలు ఆగడం లేదంటే, తుఫాన్ల ప్రభావం ఉండే నవంబర్​లోనూ వర్షాలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘స్థానిక వాతావరణం మీద సరైన అధ్యయనం చేస్తే, అప్పుడు అనూహ్య పరిణామాలను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది”అని చెప్పారు. కానీ రాష్ట్ర సర్కార్ ఇలాంటి ప్రయత్నాలేమీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ముందస్తు ప్రణాళికలే ముఖ్యం... 


వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు ఇపుడు టెక్నాలజీ బాగా పెరిగిందని, ముందస్తు హెచ్చరికలు గతంలో కన్నా మెరుగ్గా వస్తున్నాయని వాతావరణ శాఖ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ చెప్పారు. ‘‘వర్షాలతో ఎక్కువ నష్టం సంభవించడానికి కారణం.. ముందస్తుగా అంచనా వేయలేకపోవడం కాదు. ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా లేకపోవడమే. అంతేకాకుండా నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు సంబంధించి అన్ని నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అందుకే వరద ఇండ్లలోకి, రోడ్లపైకి వస్తోంది. చెరువుల్లో పూడిక తీయకపోవడం, వాటికి అడ్డుకట్టలు వేస్తూ రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించడంతో పంటలు మునుగుతున్నాయి” అని తెలిపారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర ఉపరితలంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. సముద్రాలపై ఉండే నీటి ఆవిరిలో ఉష్టోగ్రతలు ఎక్కువవుతున్నాయి. దాంతో అవి ఎక్కవ తేమను ఒడిసిపట్టుకుంటున్నాయి. ఉపరితల ద్రోణులు ఏర్పడినపుడు అవి ఒకేసారి విరుచుకుపడడం వల్ల ఎక్కువ మొత్తంలో వర్షం పడుతోంది’’ అని వివరించారు. ‘‘ఉత్తర కోస్తాలో తుఫాన్ల ప్రభావం ఉన్నప్పుడు తెలంగాణలోనూ వర్షాలు పడతాయి. ప్రస్తుతం వాతావరణంలోని మార్పులను పరిశీలిస్తే తుఫాన్లు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు అధిక వర్షాలు పడొచ్చు” అని వెల్లడించారు. దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు.