దేశ సమగ్రతకు యూసీసీ కావాలి!

దేశ సమగ్రతకు యూసీసీ కావాలి!

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే పన్నుల విధానం లాగానే ఒకే పౌర చట్టం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరమే. దేశ పౌరులందరికీ సమానంగా ఒకే చట్టం వర్తింపజేయాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం స్వాగతించాల్సిందే. ఊరుకో సాంప్రదాయం, కుటుంబానికో సంస్కృతి, ఒక్కో వ్యక్తికి ఒక్కో తీరు, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉన్న కారణంగానే సమాజంలో- “దేశంలో పౌరులందరికీ ఒకే చట్టం అమలు చేయడం” అన్న విషయం గత 75 ఏండ్లుగా వాయిదా పడుతూనే వస్తున్నది. 

అనేక ఎగుడు దిగుడులు ఉన్న భారత సమాజంలో రాజ్యాంగ విలువలను -సామాజిక రీతులను సమతుల్యం చేయడం కత్తి మీద సాము లాంటిది. అయినా ఇప్పుడు జరుగుతున్న ఆ ప్రయత్నాన్ని స్వాగతించాలి. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, లింగ భేదాలకు అతీతంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయ,- మానవ హక్కుల దృక్పథంతో ఆలోచించి ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉంది. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, బలహీనులు, ట్రాన్స్ జెండర్ల వంటి వివిధ వర్గాల హక్కులను దృష్టిలో ఉంచుకొని భారతీయ పౌరులందరికీ ‘సర్వ సమానమైన హక్కులను ఉమ్మడి పౌరస్మృతి’గా అందించాలి. 

విశ్వ మానవ విలువలను స్వాగతించాలి. యూసీసీ అనేది కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా ఏ ఒక్క మతాన్నో, కులాన్నో, ప్రజల జీవన విధానాన్నో, ఆచార సాంప్రదాయాలనో లక్ష్యంగా చేసుకొని ప్రతిపాదిస్తున్నది కాదు. విస్తృతమైన ఫ్రేమ్ వర్క్ లో యూనియన్ సివిల్ కోడ్ రూపొందించకపోయినా, దేశ పౌరుల అభ్యంతరాలను పట్టించుకోకపోయినా, బిల్లు పాస్ కావాలనే ఆత్రుతతో ప్రవర్తించినా జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది.ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పనలో, అమలులో జాప్యం జరిగితే భారతీయ సమాజం ఒంటికాలితో ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తుంది. 
– కె. శ్రీనివాసాచారి, తూప్రాన్