కందుకూరు వ‌ర‌కు మెట్రో రైలు పొడిగింపు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

కందుకూరు వ‌ర‌కు మెట్రో రైలు పొడిగింపు.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

రాష్ట్ర రాజధానిలోని మరిన్ని ప్రాంతాలను కలుపుకుని హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌ మెట్రోరైలును శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించడం అనేది త్వరలోనే సాకారం కానుందని, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు వరకు దీన్ని పొడిగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో హరితహారం ఫేజ్-9 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. .

మెట్రో రైలును కందుకూరు వరకు పొడిగించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ దీన్ని 'వాస్తవమైన డిమాండ్'గా అభివర్ణించారు. బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో కనెక్టివిటీని 'తప్పనిసరి అవసరం' అని కూడా కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గతేడాది డిసెంబర్ లో శకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద పునాదిరాయి వేశారు.

మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లోనే ప్రయాణించేలా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని కూడా నిర్మించనుంది.