ఆరున్నర లక్షల మందికి కంటి పరీక్షలు.. 5 నెలలవుతున్నా అందని రిపోర్ట్స్​

ఆరున్నర లక్షల మందికి కంటి పరీక్షలు.. 5 నెలలవుతున్నా అందని రిపోర్ట్స్​
  • మూడేండ్ల కింద చింతమడకలో టెస్టులు..ఇప్పటికీ రిపోర్టులు ఇవ్వలే
  • ఈ ఏడాది మార్చిలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
  • ఇప్పుడు తెరపైకి మళ్లీ కంటి వెలుగు
  • మొదటి విడతలో కంటి అద్దాలతోటే సరిపెట్టిన సర్కార్​
  • ఇక ఈఎన్‌టీ స్క్రీనింగ్ ఉత్త ముచ్చటే అని విమర్శ

హైదరాబాద్, వెలుగు : స్టేట్ హెల్త్ ప్రొఫైల్ వెనక్కిపోయింది. అందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇస్తామని సీఎం ఏండ్లుగా చెబుతున్న మాటలు అమలు కావడం లేదు. ఇక ఈఎన్​టీ స్క్రీనింగ్​ ఉత్త ముచ్చటైంది. ఇవన్నీ పక్కనపెట్టి.. రెండో విడత కంటి వెలుగును తెరపైకి తీసుకొచ్చారు. కారును పోలిన మరో గుర్తుకు ఓటేసే ప్రమాదం ఉందని భావించి, వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రం‌‌‌‌లో 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమా‌‌‌‌చార నివే‌‌‌‌దిక (హెల్త్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌) సిద్ధం చేయా‌‌‌‌లన్న లక్ష్యంతో ‘స్టేట్ హెల్త్​ ప్రొఫైల్ ప్రాజెక్టు’ను కేసీఆర్ తీసుకొచ్చారు. దీర్ఘకా‌‌‌‌లిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరు‌‌‌‌గైన వైద్యం అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2019, జులై 22న కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకకు వెళ్లినప్పుడు హెల్త్​ ప్రొఫైల్​తయారీపై ప్రకటన చేశారు. ఇంగ్లండ్, అమెరికా తర్వాత మన రాష్ట్రంలోనే, అదీ చింతమడకలోనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెండేండ్లు గడిచినా ఒక్కరికీ పరీక్షలు చేయలేదు. కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​కు చెందిన 50 మంది సిబ్బందితో పాటు జిల్లా వైద్యాశాఖ అధికారులు 2021, ఆగస్టు 3న చింతమడకలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 8 రోజుల క్యాంపులో చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన మొత్తం 5,561 మందికి పరీక్షలు చేశారు. ఒక్కొక్కరికి 36 రకాల టెస్టులు చేశారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇప్పటికీ ఇవ్వలేదు.  

మార్చిలో పైలెట్ ప్రాజెక్టు

ఈ ఏడాది మార్చిలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్​ ప్రొఫైల్​ పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌ చేపట్టి, జూన్‌‌‌‌లో పూర్తయినట్టు ప్రకటించారు. లోపాలు గుర్తించి త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. ఐదు నెలలవుతున్నా ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో సుమారు ఆరున్నర లక్షల మంది నుంచి టెస్టుల కోసం శాంపిల్స్ సేకరించారు. కానీ, ఇప్పటి దాకా ఎవరికీ కార్డులివ్వలేదు. ఇదిలా ఉండగానే కొత్తగా కంటి వెలుగు రెండో ఫేజ్​ను అమలు చేయబోతున్నట్టు కేసీఆర్​ ప్రకటించారు. జనవరి 18వ తేదీ నుంచి క్యాంపులు ప్రారంభించాలని ఆదేశించారు. హెల్త్ ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేశారు. దీంతో ఇప్పట్నుంచే క్యాంపుల నిర్వహణ, ట్రైనింగ్, ఎక్విప్‌‌‌‌మెంట్ కొనుగోలు, అద్దాల టెండర్లు తదితర అంశాలపై గ్రౌండ్ లెవల్ సిబ్బంది, ఆఫీసర్లను సిద్ధం చేస్తున్నారు. హెల్త్ ప్రొఫైల్ సంగతేంటని అడిగితే, ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటున్నారు. జూన్ దాకా 
కంటి వెలుగు క్యాంపులతోనే హెల్త్ స్టాఫ్ బిజీగా ఉంటారని, ఇప్పుడు హెల్త్ ప్రొఫైల్ కోసం ఇంటింటికి వెళ్లి టెస్టులు చేసుడు అసాధ్యమని చెబుతున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎన్నికల వాతావరణమే ఉంటుంది. ఇక ఎలక్షన్ల తర్వాతే హెల్త్ ప్రొఫైల్ ముచ్చట అని, అప్పుడు ఉండే ప్రభుత్వాలను బట్టి దానిపై నిర్ణయం ఉండొచ్చునని ఆఫీసర్లు చెబుతున్నారు.

పట్టాలెక్కని ఈఎన్‌‌‌‌టీ స్ర్కీనింగ్

కంటి వెలుగు క్యాంపులు పెట్టి కంటి పరీక్షలు చేసినట్టుగానే, ఈఎన్‌‌‌‌టీ స్ర్కీనింగ్ కూడా చేపిస్తామని సీఎం కేసీఆర్ ఐదేండ్ల కిందే ప్రకటించారు. ప్రతి ఒక్కరికీ చెవి, ముక్కు, గొంతు పరీక్షలు చేపించి, అవసరమైన వారికి చికిత్స అందిస్తామని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సందర్భం వచ్చినప్పుడుల్లా ఇదే ముచ్చట కేసీఆర్ చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ కనీసం పట్టాలైనా ఎక్కింది. ఈఎన్‌‌‌‌టీ స్క్రీనింగ్ మాత్రం, ఉత్తి మాటలకే పరిమితమైంది.

కంటి వెలుగు ఓట్ల కోసమే!

హెల్త్ ప్రొఫైల్‌‌‌‌ను పక్కనబెట్టి, కంటి వెలుగును తెరపైకి తేవడంపై డాక్టర్లు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే కంటి వెలుగు అమలుకు పూనుకున్నారని పోస్టులు పెడుతున్నారు. రాష్ట్రంలో చాలా మంది వృద్ధులు కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వీరికి అద్దాలు ఇచ్చి సానుభూతితో ఓట్లు వేయించుకునే ప్రయత్నమేనని దుయ్యబడుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు పొందే వాళ్లు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేస్తారని ఆ పార్టీ పెద్ద లీడర్లు భావిస్తున్నారు. కంటి సమస్యలు ఉన్నవాళ్లు, కారును పోలిన మరో గుర్తుకు ఓటు వేసే ప్రమాదం ఉంటుందన్నది వారి ఆందోళన. ఈ క్రమంలో వాళ్లకు కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇస్తే, ఓట్లు క్రాస్ అవ్వకుండా చూసుకోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. కంటి వెలుగు మొదటి దశ స్ర్కీనింగ్ లో 9 లక్షల మందికి ఆపరేషన్లు చేయించాల్సి ఉందని డాక్టర్లు గుర్తించారు. కానీ, వీరెవరికీ ఆపరేషన్లు చేయించకుండా, అద్దాలతోనే సరిపెట్టారు.