లాక్‌డౌన్‌తో కంటి రోగులు ఐదింతలు పెరిగారు

లాక్‌డౌన్‌తో కంటి రోగులు ఐదింతలు పెరిగారు

 చెన్నై: లాక్ డౌన్‌తో మనదేశంలో కంటి రోగులు ఐదింతలు పెరిగారు. రోజంతా ఇళ్లలోనూ ఉండిపోవడంతో గంటల తరబడి టీవీ చూడడం..  లేదా మొబైల్ ఫోన్లు, లాప్ టాప్‌లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపడంతో కంటి సమస్యలు బాగా పెరిగాయట. పిల్లలు మొదలు పెద్దల వరకు కంటి సమస్యలు లేని వారికి సైతం లాక్ డౌన్ కంటి సమస్యలు తెచ్చింది. అలే ఇప్పటికే సమస్యల్లో ఉన్నవారి పరిస్థితి బాగా ముదిరిపోయింది. కరోనాకు భయపడి చాలా మంది కంటి డాక్టర్ల దగ్గరకు వెళ్లకపోవడంతో కంటి సమస్యలు బాగా ముదిరాయట.  దేశ వ్యాప్తంగా  దాదాపు 1.20 కోట్ల మందికిపైగా కంటి రోగాలు బాగా ముదిరిన పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్సకు వస్తున్నారని ఒక అంచనా. చెన్నైలో డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ అమర్ అగర్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ తో కంటి సమస్యలు బాగా పెరిగాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా వందకు పైగా ఉన్న అగర్వాల్‌ ఆస్పత్రుల్లో  రోజుకు 15 వేల మంది చికిత్స కోసం వస్తున్నారని.. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంటి సమస్యలు పెరగడానికి దారితీసిన కారణాల గురించి ఆరా తీస్తే చాలా సింపుల్ గా కనిపించే అలవాట్లే కళ్లకు హాని చేసినట్లు గుర్తించారు. కొద్దిసేపు అనుకుంటూనే అందరూ గంటల తరబడి టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారని.. ఆ అలవాట్లను కంట్రోల్ చేసుకోలేక కంటి జబ్బులకు గురయ్యారని తేలింది.

  • ఇప్పటికే కంటి సమస్యల్లో ఉన్న వారికి కంటి చూపు క్రమంగా మందగిస్తూ వచ్చింది.
  • కంటిలో పొరలు ఏర్పడడం, తడిఆరిపోవడం వంటి సమస్యలతో బాధపడ్డారు.
  • లాక్‌డౌన్‌లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరుకావడంతో పిల్లల్లోనూ సమస్యలు పెరిగాయి.
  • ఐటీ ఉద్యోగులు ఇంటిదగ్గరే గంటల తరబడి కంప్యూటర్లతో పనిచేయడంతో కంటి జబ్బులకు గురయ్యారు.
  • ఇళ్లలోనే ఉన్నవారు వినోదాల కోసం టీవీ కార్యక్రమాలను విరామం లేకుండా చూడటం వంటి కారణాలతో కంటి సమస్యలకు గురయ్యారు.
  • కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల వద్ద గంటల తరబడి పనిచేసినవారికి కళ్ళలో తడి ఆరిపోయింది.  చూపు మందగించి అవస్థలు పడుతున్నారు.
  • లాక్ డౌన్ కు ముందు కనీసం మూడు నెలలకోసారి వైద్యులతో చూపించుకునేవారు. లాక్ డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడానికి దాదాపు 11 నెలల టైమ్ పట్టడంతో కంటి సమస్యలు బాగా పెరిగాయి.

అందుకే కంటి సమస్యలున్నవారు  ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటే మంచిదంటున్నారు నేత్ర వైద్య నిపుణులు.

అగర్వాల్‌ హాస్పిటల్స్‌ ఈడీ డాక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌, డాక్టర్‌ ఎస్‌.సౌందరి తదితరులు మాట్లాడుతూ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నందున రోగులు నిర్భయంగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని కోరారు. తమ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ‘ఏవా గ్లకోమా టెస్ట్‌’ పరికరాలను ఏర్పాటు చేశామని, ఆ పరికరం ద్వారా కంటి వ్యాధులను క్షణాలను గుర్తించగలిగి చికిత్స అందిస్తున్నామని వివరించారు.

 

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల

ఫన్నీ వీడియో: జూమ్ కాల్ మీటింగ్‌లో ఉన్న భర్తను కిస్ చేయబోయిన భార్య

వ్యాక్సినేషన్ బార్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్