
హైదరాబాద్, వెలుగు: సర్కారు టీచర్లు, బోధనేతర సిబ్బందికి ఫేస్ రెకగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ విధానం మొదలైంది. తొలిరోజు శుక్రవారం 75శాతం మంది రిజిస్టర్ చేశారు. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో మొత్తం 24,973 సర్కారు స్కూళ్లున్నాయి. వీటిలో 1,28,760 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో శుక్రవారం సాయంత్రం 5గంటల వరకూ 96,327 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 32,433 మంది ఉద్యోగులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది.
ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం ప్రారంభం కావడంతో, రెండు, మూడు రోజుల్లోనే పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. కాగా, రిజిస్టర్ చేసుకున్న వారిలో 89,922 మంది (93.3%) ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకున్నారు. మరో 6,405 మంది రిజిస్టర్ చేసుకున్నా.. యాప్ ద్వారా అటెండెన్స్ వేయలేదు.
పెద్దపల్లిలో 97.17% రిజిస్టర్..
గతేడాది డిసెంబర్ లో పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. దీంతో ఈ జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 97.17% మంది ఎంప్లాయీస్ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో భద్రాద్రి, వికారాబాద్ ఉన్నాయి. అత్యల్పంగా భూపాలపల్లిలో 59%, నిర్మల్ లో 59.91%, నారాయణపేటలో 62.17%, ములుగు జిల్లాలో 65.25% మంది రిజిస్టర్ చేసుకున్నారు.