ఇక ఆలస్యంగా వచ్చే టీచర్లకు చెక్ .. సర్కార్బడుల్లో టీచర్లకు ఫేస్రికగ్నేషన్ అటెండెన్స్

ఇక ఆలస్యంగా వచ్చే  టీచర్లకు చెక్ .. సర్కార్బడుల్లో టీచర్లకు ఫేస్రికగ్నేషన్ అటెండెన్స్
  • వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అమలులోకి..​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్కూళ్లలో విధులకు డుమ్మా కొట్టే వారితో పాటు ఆలస్యంగా వచ్చే టీచర్లకు చెక్​పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ను అమల్లోకి తీసుకువస్తోంది. సర్కార్​బడుల్లో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ పద్ధతి అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ పూర్తి స్థాయిలో అమలు కానుంది.  

పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ.. 

జిల్లాలో డీఈఓ, ఎంఈఓ ఆఫీలతో పాటు 756 ప్రాథమిక పాఠశాలలు, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు, 110 హైస్కూళ్లు​ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4వే ల మందికి పైగా టీచర్లు, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ పని చేస్తున్నారు. పట్టణ ప్రాంతంతో పాటు ఏజెన్సీలోని మారు మూల ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు చాలా మంది ప్రేయర్​ అయిపోయి క్లాసులు స్టార్ట్​ అయినా రాని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో అయితే ఇద్దరు టీచర్లుంటే ఒక టీచర్​ వారం రోజులు మరో టీచర్​ వారం రోజులుగా వంతుల వారీగా అటెండ్​ అవుతున్న దాఖలాలున్నాయి. ఇదే విషయంలో ఉమ్మడి గుండాల మండలంలో కొందరికి గతంలో మెమోలు ఇవ్వడం, సస్పెండ్​ చేసిన ఘటనలున్నాయి. కొందరు టీచర్లు మధ్యాహ్నం టైంలోనే ఇండ్లకు వెళ్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

 ఈ పరిస్థితుల్లో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ను తీసుకువచ్చింది. గవర్నమెంట్​ స్కూళ్ల​లో ఇప్పటికే స్టూడెంట్స్​కు ప్రత్యేక యాప్​ ద్వారా ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ ప్రయోగాత్మకంగా అమలవుతోంది. టీచర్స్​కు కూడా ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ ను తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్​ చేసింది.  ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 

నాణ్యమైన విద్య అందించేందుకే.. 

ఫేస్​ రికగ్నేషన్​ అటెండెన్స్​ను జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నాం. మొదటి వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత పూర్తి స్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రత్యేక యాప్​ ద్వారా టీచర్లతో పాటు నాన్​ టీచింగ్​ సిబ్బంది కూడా అటెండెన్స్​ను వేయాల్సి ఉంటుంది. 

విద్యాశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ యోగితారాణా ఇప్పటికే ఈ విధానంపై స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ యాప్​ ద్వారా టీచర్లు పాఠశాలకు అనుమతి లేకుండా గైర్హాజరయ్యే అవకాశం లేదు. ఆలస్యంగా రావడం, సమయాని కంటే ముందుగానే వెళ్లడం లాంటివి నిరోధించవచ్చు. తద్వారా స్టూడెంట్స్​కు న్యాయమైన విద్యను అందించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. 

వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రికొత్తగూడెం