Fact Check : ఆధార్ కార్డుతో రూ.10 లక్షల అప్పు ఇస్తారా..! నిజమెంత..?

Fact Check : ఆధార్ కార్డుతో రూ.10 లక్షల అప్పు ఇస్తారా..! నిజమెంత..?

ప్రధాన మంత్రి ఆధార్ కార్డ్ లోన్ స్కీమ్ ద్వారా ప్రజలు రూ. 10లక్షల వరకు రుణాలు పొందవచ్చట. అవునా. ఇది నిజమా.. అయితే వెంటనే అప్లై చేద్దామని వెళ్తున్నారా.. వెళ్లండి.. కానీ వెళ్లే ముందు అసలు ఈ వార్త నిజమా, కాదా క్లారిటీ వచ్చాక వెళ్లండని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఇలాంటి ఫేక్ స్కీమ్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. కేవలం మౌత్ టాక్ తోనే పాపులారిటీ తెచ్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఒక సోషల్ మీడియా వెబ్ సైట్ లో హల్ చల్ చేస్తోంది. వెబ్‌సైట్ ప్రకారం, ఈ పథకం కొత్త వ్యాపారాన్ని స్థాపించాలనుకునే లేదా పాత వ్యాపారాన్ని విస్తరించాలనుకునే యువ వ్యవస్థాపకుల కోసం.

అయితే ఈ వెబ్‌సైట్ ఎంత ఖచ్చితమైనది? వ్యాపారాలను స్థాపించడానికి ప్రజలు ఏ ప్రభుత్వ పథకం కింద రుణాలు పొందవచ్చు? ఈ ప్రయోజనం వస్తోన్న వార్తలు నిజమేనా అన్న విషయంపై ఫ్యాక్ట్ చెక్ ఓ నివేదిక వెల్లడించింది. దీనిపై సమగ్ర పరిశీలన చేసి.. స్పష్టతనిచ్చింది. అదనంగా, ఈ పథకంలో పాల్గొన్న ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ బ్యాంకు ఆధార్ కార్డ్ వంటి ప్రాథమిక పత్రాల సహాయంతో రుణాలను పొందవచ్చని వెబ్‌సైట్ తెలిపింది.

దీనిపై గూగుల్‌లో 'PM ఆధార్ కార్డ్ లోన్' అనే కీవర్డ్‌ని సెర్చ్ చేయడంతో అసలు నిజం వెల్లడైంది. ఈ వార్తను sarkariyojnanews.com అనే వెబ్‌సైట్, achiloan.in అనే మరో వెబ్‌సైట్ జూన్ 22న ప్రచురించాయి. భారత ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్‌సైట్‌లలో మరిన్ని వివరాల కోసం శోధిస్తున్నప్పుడు, అటువంటి పథకం ఏదీ లేదని దీని ద్వారా బట్టబయలైంది. అంతే కాకుండా PIB ఫ్యాక్ట్ చెక్ కూడా ట్విట్టర్ లో ఈ క్లెయిమ్‌లను 'ఫేక్' అని ఖండిస్తూ ఒక ట్వీట్‌ కూడా చేసింది.

అయితే ఈ దావా పూర్తిగా తప్పు కాదని గమనించడం ముఖ్యం. 'PM ముద్రా యోజన' (PMMY) కింద నాన్-కార్పోరేట్, చిన్న/సూక్ష్మ పరిశ్రమల కోసం ప్రభుత్వం రూ. 10 లక్షల వరకు రుణాలను అందజేస్తుంది. ఈ రుణాలు PMMY కింద ముద్రా రుణాలుగా వర్గీకరించారు, ఇవి కార్యకలాపాల ఖర్చులను కూడా భరిస్తాయి. ఇటువంటి రుణాలను వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు (MFIలు), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) ఇస్తాయి. రుణాలు పొందేందుకు, వ్యక్తులు తమ ఆధార్ కార్డును గుర్తింపు రుజువుగా, వ్యాపార రుజువుగా పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.

కాబట్టి పై దావా పూర్తిగా తప్పు కానప్పటికీ, తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఫైనల్ గా చెప్పేదేమంటే.. ప్రస్తుతం "PM మోదీ ఆధార్ కార్డ్ లోన్" లాంటి స్కీమ్ ఏదీ ఇండియాలో లేదు. PM ముద్రా యోజన ద్వారా రుణాలు అందించబడతాయి. అదనంగా, ఈ పథకం కేవలం ఒకరి ఆధార్ కార్డ్ ఆధారంగా మాత్రమే రుణాలను అందించదు. మీకు ఈ పథకం గురించి వివరణాత్మక సమాచారం కావాలంటే, మీరు ప్రభుత్వ వెబ్‌సైట్‌లను చూడవచ్చు.