ఎల్బీ స్టేడియం జంక్షన్లలో ట్రాఫిక్​ జామ్

ఎల్బీ స్టేడియం జంక్షన్లలో ట్రాఫిక్​ జామ్
  • ఎల్బీ స్టేడియం పరిసరాల్లో భారీగా వెహికల్స్​ రద్దీ.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ వీవీఐపీలు
  •     రవీంద్ర భారతి నుంచి నడుచుకుంటూ వెళ్లిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య
  •     లక్డీకపూల్ నుంచి నడిచి వెళ్లిన మంత్రి దామోదర రాజనర్సింహ
  •     ట్రాఫిక్​లో ఇరుక్కున్న గవర్నర్ కాన్వాయ్
  •     వెహికల్స్​ జామ్​తో  ఆగిన ఎమ్మెల్యేల బస్సులు
  •     స్టేడియం లోపల స్టేజీ వద్దకు వెళ్లిన పార్టీ కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పోలీసు శాఖ వైఫల్యం  అడుగడుగునా బయట పడింది. ట్రాఫిక్​జామ్​తో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎల్బీ స్టేడియంలోకి సోనియా, రాహుల్, ప్రియాంక , సీఎం రేవంత్ వచ్చినా.. గవర్నర్ రాకపోవడంతో  స్టేడియం చుట్టూ ఓపెన్ టాప్ జీప్​లో సోనియా పబ్లిక్ కు అభివాదం చేశారు.

దీంతో ప్రమాణ స్వీకారం అనుకున్న టైమ్ కంటే  లేట్ అయింది.  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అయ్యేందుకు వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. దీంతో రవీంద్ర భారతి దగ్గర కాన్వాయ్ దిగి స్టేడియం వరకు ఆయన నడుచుకుంటూ వెళ్లారు. ఇక డిప్యూటీ సీఎం శివకుమార్ సైతం కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వెళ్లారు.

లక్డీకపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదురుగా భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో మంత్రి దామోదర రాజనర్సింహ వెహికల్ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ పోగ్రాంకు అటెండ్ అయ్యారు. ఎల్బీ స్టేడియం వైపు వచ్చే అన్ని రోడ్లపైకి పబ్లిక్ భారీగా చేరుకున్నారు. పాస్ ల వారీగా పార్కింగ్ ప్రాంతాలు కేటాయించినప్పటికీ.. రోడ్ల మీదే టు వీలర్లు, కార్లు ఆపి స్టేడియం లోపలకు వెళ్లారు. పోలీసులు అక్కడే డ్యూటీల్లో ఉన్నా చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.  

స్టేడియం వద్ద సెక్యూరిటీ వైఫల్యం

ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి 2 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు గత రెండు రోజుల నుంచి డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ అధికారులు ప్రకటించారు. స్టేడియం వైపు వచ్చే వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నట్లు, రోడ్లు బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత మంది పోలీసులు డ్యూటీలో ఉన్నా..  కాన్వాయ్ లు వచ్చే టైమ్ లో రోడ్ల మీద వెహికల్స్ ను, పబ్లిక్ ను క్లియర్ చేయలేదు.

రోడ్లపై వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నా పోలీసులు వారించలేదు. స్టేడియంకు వచ్చే రోడ్డు మొత్తం జామ్ కావటంలో ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్ కాన్వాయ్, ఎమ్మెల్యేల బస్సులు, గవర్నర్ కాన్వాయ్ స్టేడియం లోపలికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది అయింది. ఇక వీరి కాన్వాయ్ లు వచ్చినప్పుడు నాంపల్లి వైపు నుంచి లక్డీకపూల్ వైపు, అసెంబ్లీ నుంచి నాంపల్లి వైపు వెల్లే జనరల్ పబ్లిక్, టు వీలర్స్ రావటంతో గవర్నర్ కాన్వాయ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది.

దీంతో ప్రమాణ స్వీకారం అనుకున్న టైమ్ కంటే 20 నిమిషాలు లేట్ అయింది. ఇక పోగ్రాం అయిపోయిన తరువాత లక్డీకపూల్, సెక్రటేరియెట్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రతిష్టాత్మక ప్రోగ్రాంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.